Begin typing your search above and press return to search.

ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. హోంశాఖ ఎవరికి?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనను పూర్తి చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ అక్టోబర్ లోగా నిర్వహించాలని చూస్తోంది.

By:  Satya P   |   27 Aug 2026 9:11 AM IST
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. హోంశాఖ ఎవరికి?
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్ళ పాలనను పూర్తి చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ అక్టోబర్ లోగా నిర్వహించాలని చూస్తోంది. ఆ తరువాత అన్నీ సమీక్షించుకుని మంత్రుల పనితీరుని స్థానిక ఫలితాల తరువాత మరోమారు బేరీజు వేసుకుని పూర్తి స్థాయిలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో కూడా ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముడిపడి ఉందని అంటున్నారు. కేంద్రంలో కొత్తగా ఎవరికి చాన్స్ ఇస్తున్నారు. ఎంత మందికి చాన్స్ వస్తుంది, ఏ ప్రాంతం, సామాజిక రాజకీయ సమీకరణలను కూడా కూలంకషంగా పరిశీలించుకుని ఏపీలో సమగ్రమైన తీరులో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు. ఒక కేబినెట్ బెర్త్ ఖాళీగా ఉంది.

కొత్త వారికి అవకాశంతో :

చంద్రబాబు నాలుగవ సారి 2024 జూన్ 12న ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. బాబు కేబినెట్ లో ఎపుడూ సీనియర్లు మంత్రులుగా కనిపించేవారు. ఈసారి దానికి భిన్నంగా ఎక్కువ మంది కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. మొదటి సారి గెలిచి వచ్చిన వారికి కూడా మంత్రి వర్గంలో చోటు దక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ యువతరానికి పెద్ద పీట వేయాలని అలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటుగా సీనియర్లు కొంతమందిని జత చేర్చారు. అయితే ఇరవై నాలుగు మంత్రి మంత్రులలో ఎంత మంది సంతృప్తి స్థాయిలో పనిచేస్తున్నారు అన్నది కూడా కూటమి పెద్దల వద్ద నివేదికలు ఉన్నాయని అంటున్నారు. శాఖల వారీగా మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు మధింపు చేస్తూ ర్యాంకులను కూడా చంద్రబాబు ఇస్తున్నారు. కొందరి పనితీరుని మార్చుకోమని కూడా కోరుతున్నారు. అయినా సరే ఆశించిన స్థాయిలో మార్పు రాలేదన్నది అయితే ఉంది. అయితే ఇపుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందుకే విస్తరణ వంటి తేనెతుట్టెను కదపడం లేదని అంటున్నారు. వ్యూహాత్మకంగానే విస్తరణను మరిన్నాళ్ళకు వెనక్కి నెట్టారని అంటున్నారు.

లా అండ్ ఆర్డర్ మీదనే :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన శాఖల తీరు ఎలా ఉన్నా లా అండ్ ఆర్డర్ విషయంలో సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ నియంత్రించే విధంగా హోం మంత్రి పని తీరు లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సందర్భాలలో బాహాటంగానే హోం శాఖ పనితీరు మీద విమర్శలు చేశారు. ఇక తాజాగా చంద్రబాబు అయితే ఏకంగా స్టేషన్ లో ఉన్న ఎస్సై స్థాయి అధికారి నుంచి రాష్ట్ర డీజీపీ వరకూ మొత్తం అధికారులతో లా అండ్ ఆర్డర్ మీద సుదీర్ఘమైన సమీక్షను నిర్వహించారు. ఇది ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి సీరియస్ గానే వ్యవహరించారు అని చెప్పడానికి ఉదాహరణ అని అంటున్నారు. మరో వైపు విపక్షానికి కీలకమైన హోం శాఖ వంటి వాటి ద్వారానే ఆస్త్రాలు అందుతున్నాయన్న చర్చ కూడా కూటమిలో ఉందని అంటున్నారు.

ఈసారి ఎవరికి అంటే :

విస్తరణలో హోం శాఖ వేరే వారికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. అయితే హోంశాఖ ఎవరికి ఇస్తారు అన్నది కూడా ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. ఎవరికి ఇచ్చినా ఇది క్లిష్టమైన కష్టమైన శాఖ అని అంటున్నారు. గతంతో పోలిస్తే నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎంత టెక్నాలజీ వస్తున్నా అది కూడా నేరగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న నేపధ్యం ఉంది. ఇక హోం శాఖ అంటే సెల్యూట్ ని పోలీసుల నుంచి అందుకోవడం తప్ప ప్రత్యేకంగా ఏమీ ఉండదని అంటున్నారు. పైగా నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దాంతో టెన్షన్ విపక్షాల నుంచి విమర్శలు వస్తూంటాయి. దాంతో హోం శాఖ పట్ల గతంలో చాలా మంది మోజు చూపించినా ఇపుడు అయితే ఎందుకొచ్చిన తలనొప్పి అని భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక చూస్తే వైసీపీ హయాం నుంచి వరసగా ఏడేళ్ళుగా మహిళలే ఈ శాఖను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం మగవారికి ఇవ్వవచ్చు అని అంటున్నారు. వీలైతే మిత్ర పక్షాలకు కూడా ఇచ్చే వీలుందని అంటున్నారు. మరి కొత్త హోం మంత్రి ఎవరు అన్నది తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే అని అంటున్నారు.