నివాళి సరే... ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏది బాబూ ?
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి పదకొండు జిల్లాల అంధ్ర రాష్ట్రం 1953లో విడిపోయింది. అక్టోబర్ 1న కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది.
By: Satya P | 15 Dec 2025 10:50 PM ISTఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి పదకొండు జిల్లాల అంధ్ర రాష్ట్రం 1953లో విడిపోయింది. అక్టోబర్ 1న కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది. తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం అంత సులువుగా విడిపోలేదు అప్పుడు కేంద్రంలో ప్రధానిగా ఉన్న పండిట్ నెహ్రూ అయితే ఈ విభజన ప్రతిపాదనకు తొలుత అంగీకరించలేదు. ఉమ్మడి మద్రాస్ సీఎం గా ఉన్న రాజాజీ కూడా విభజనకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే పొట్టి శ్రీరాములు రంగ ప్రవేశం చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరణ దీక్ష చేపట్టారు. 1952 అక్టోబర్ 19న ప్రారంభించారు అది కాస్తా ఏకంగా 58 రోజుల పాటు ఆయన అలుపెరగని కఠోరమైన దీక్ష చివరికి 1952 డిసెంబర్ 15న ఆత్మ బలిదానం దాకా వెళ్ళింది. అలా ఆయన ఆంధ్రులకు తన బలిదానం ద్వారా ప్రత్యేక రాష్ట్రం తీసుకుని వచ్చిన అమరజీవిగా చరిత్రలో మిగిలారు.
నివాళి మాత్రమేనా :
చాలా మంది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి పొట్టి శ్రీరాములు దీక్ష చేశారు అనుకుంటారు. అది వాస్తవం కాదు, ప్రస్తుతం ఉన్న ఏపీ భౌగోళిక స్వరూపంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసమే ఆయన అమరుడు అయ్యారు. ఆ తరువాత 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళ పాటు కర్నూల్ రాజధానిగా కొనసాగింది. ఆ మీదట నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి ఉమ్మడి ఏపీగా 1956 నవంబర్ 1న అవతరించింది. ఆనాటి నుంచి ఆంధ్రులు రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రతీ ఏటా నవంబర్ 1న జరుపుకుంటారు. అయితే 2014లో తిరిగి విభజన జరిగి ఏపీ మళ్ళీ విడిపోయాక నాటి నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయితే ఏపీలో జరగడం లేదు. 2014లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ నవంబర్ 1 ని పూర్తిగా మరచిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నవంబర్ 1ని అవతరణ దినోత్సవం చేసింది కానీ 2024 నుంచి మళ్ళీ ఆంధ్రులకు అవతరణ దినోత్సవం అన్నది లేకుండా పోయింది.
ఏదో ఒక డేట్ :
ఏపీ ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అక్టోబర్ 1న. అలా అనుకుంటే ఆ డేట్ నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ గా భావించి నిర్వహించవచ్చు. అలా కాదు అనుకుంటే ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న నవంబర్ 1ని కూడా ఎంచుకుని ఆ రోజుని కూడా ఆంధ్ర రాష్ట్రం పుట్టిన రోజుగా చేయవచ్చు. కానీ ఈ రెండు డేట్లను కూడా పక్కన పెట్టడమే కాదు అసలు అవతరణ దినోత్సవాలు లేవు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రాభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.
అమరజీవి కోరుకున్నది :
ఏపీ సమగ్ర అభివృద్ధిని అమరజీవి బలంగా కోరుకున్నారు. అంతే కాదు అన్ని ప్రాంతాలు ప్రగతితో వికసించాలని ఆయన ఆశించారు. ఉమ్మడి మద్రాస్ లో మద్రాసీలుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసిన చిన్న చూపే ఆంధ్రులలో పౌరుషాన్ని రగిలించింది. అందుకే ఆయన ఏకంగా ప్రాణ త్యాగమే చేశారు. టంగుటూరి ప్రకాశం వంటి వారు నాటి మద్రాస్ పాలకుల అహంకారానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఇలా ఆంధ్ర జాతికి నవ నిర్మాతలుగా ఉన్న వారి ఆశయాలను నెరవేర్చడమే ప్రస్తుతం పాలకుల కర్తవ్యం. ఇప్పటికైనా మించిపోయినది లేదు, ఏపీకి అవతరణ దినోత్సవం అన్నది కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి ఏటా ఒక గొప్ప పండుగగా చేయాలి. ఆ మహనీయల ఆశయాలను నెరవేరుస్తామని ప్రతిన పూనాలి.
