Begin typing your search above and press return to search.

టీడీపీ లో ర‌చ్చ: ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. !

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.

By:  Garuda Media   |   19 May 2026 9:00 PM IST
టీడీపీ లో ర‌చ్చ: ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. !
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఒకవైపు పార్టీ అధిష్టానం అందరినీ కలివిడిగా ఉండమని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వర్గపోరు అదేవిధంగా కొనసాగుతోంది. ఇటీవల నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు.. తమకు అనుకూలంగా ఉండాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. కొందరు వారికి అనుకూలంగా ఉండగా మరికొందరు మాత్రం మాజీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో క్షేత్రస్థాయిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిస్థితి ఇబ్బందికర పరిణామాలను తీసుకువస్తుంది. దీనివల్ల పార్టీకి తీవ్ర స్థాయిలో డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్ పర్సన్ గా పల్లవి పదవిని దక్కించుకున్నారు. అయితే తొలినాళ్ల‌లో ఆమె ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు అనుకూలంగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఆమెకు పదవి దక్కింద‌న్న‌ది వాస్త‌వం.

అయితే అనూహ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేకి ఆమెకు ఏర్పడిన విభేదాలు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కలిసివచ్చేలా చేసింది. దీంతో ప్రభాకర చౌదరి పల్లవితో చేతులు కలిపారని వాదన బలంగా వినిపిస్తోంది. దీనిని పసిగట్టిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మిగిలిన పాలకమండలిలోని సభ్యులను తన వైపు తిప్పుకొని.. తాను చెప్పినట్టుగా మార్కెట్ యార్డు కార్యకలాపాలు కొనసాగాలని ఆయన సూచిస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో మార్కెట్ యార్డ్ కమిటీలో సభ్యులకు చైర్పర్సన్ కు విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరిని ఒకరు అసలు పలకరించుకునే పరిస్థితి కూడా లేదు. కమిటీ తరపున కార్యక్రమాలు నిర్వహించడం కూడా మానేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆధిపత్య రాజకీయాలు మరింతగా పెరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వచ్చే ఎన్నికల్లో తానే టికెట్ దక్కించుకుని పోటీ చేస్తానని చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన చెప్పారా.. లేకపోతే నిజంగా ఇది ప్రచారమా.. అనేది పక్కన పెడితే ఈ వ్యవహారం ఎమ్మెల్యే వర్గానికి వైకుంఠం వర్గానికి మధ్య తీవ్రస్థాయిలో రచ్చ రేపుతోంది.

గత ఎన్నికల్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి పోటీ చేయాలని భావించారు. కానీ టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని ఆశించారు. అది కూడా ఆయనకు రాలేదు. ఈ పరిణామాలతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేతో విభేదించే వారిని ఆయన చేరదీయటం, వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం వంటివి సహజంగానే ఎమ్మెల్యేకు చిరాకు పుట్టిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇరువర్గాల మధ్య ఉప్పు నిప్పు మాదిరిగా పరిస్థితి మారిపోయింది.

అయితే ఈ పరిస్థితులను సరిదిద్దడానికి సీనియర్ నాయకులు ఎవరు ముందుకు రాకపోవడంతో అనంతపురం అర్బన్ లో రాజకీయం టిడిపికి వ్యతిరేకంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి దీనిని పార్టీ అధిష్టానం సరిచేస్తుందా.. లేకపోతే ఎన్నికల వరకు వేచి చూస్తుందా అనేది చూడాలి.