Begin typing your search above and press return to search.

బాబు - ప‌వ‌న్‌కు ఇది పెద్ద స‌వాలే... !

రాష్ట్ర స్థాయిలో అధికార పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది.

By:  Garuda Media   |   24 Aug 2026 11:00 PM IST
బాబు - ప‌వ‌న్‌కు ఇది పెద్ద స‌వాలే... !
X

రాష్ట్ర స్థాయిలో అధికార పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు అసలైన సవాలు ఎదురవుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు సజావుగా సాగినా త్వ‌రలో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి క్షేత్రస్థాయి సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రతి గ్రామంలోనూ దశాబ్దాలుగా ఉండే వర్గ పోరాటాలు, రాజకీయ ఆధిపత్యం, నాయకుల వ్యక్తిగత పట్టు ఈ పొత్తును క్లిష్టతరం చేస్తున్నాయి. తమ ఉనికిని కాపాడుకునేందుకు కింది స్థాయి నేతలు అధిష్ఠానం నిర్ణయాలను సైతం పక్కనబెట్టేందుకు సిద్ధపడుతుండటంతో, కూటమి సమన్వయం తీవ్ర పరీక్షగా మారింది.

పై స్థాయిలో ప‌వ‌న్ - చంద్ర‌బాబు క‌లిసే ప‌ని చేస్తూ వ‌స్తున్నారు. అయితే ఈ సారి మాత్రం జ‌న‌సేన నుంచి గ‌ట్టిగా రిటాక్ట్ త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే నాదెండ్ల మ‌నోహ‌ర్ లాంటి జ‌న‌సేన నేత ఈ సారి త‌మ‌కు ప‌ట్టున్న చోట ఎక్కువ సీట్లు కావాల‌ని డిమాండ్ తెర‌మీద‌కు తెచ్చారు. అంత‌కు ముందు టీడీపీ నుంచి నారా లోకేష్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ 80 - జ‌న‌సేన 15 - బీజేపీ 5 శాతం సీట్ల నిష్ప‌త్తిలో పోటీ చేస్తాయ‌ని కాస్త అడ్వాన్స్‌గా ప్ర‌క‌ట‌న చేశారు. ఇది జ‌న‌సేన కేడ‌ర్‌కు స‌హ‌జంగానే కోపం తెప్పించింది. ప‌వ‌న్ కూడా స్థానిక ఎన్నిక‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఎక్కువ సీట్ల‌లోనే పోటీ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే టీడీపీ నుంచి ఆ స్థాయిలో సీట్లు వ‌స్తాయా ? అన్న‌ది మాత్రం సందేహ‌మే.

గ్రామ స్థాయిలో జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కుల లెక్క‌లు వేరుగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ, వార్డు, ఎంపీటీసీ స్థాయిల్లో టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగానైనా బరిలోకి దిగాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగవు. దీంతో గ్రామ‌స్థాయిలో ప‌ట్టున్న నేత‌లు తమ సొంత బలాన్ని నిరూపించుకోవడానికి ఇది సరైన అవకాశంగా భావిస్తారు. కింది స్థాయి కేడర్ కూడా అలాగే భావిస్తోంది. ఈ నేపథ్యంలో బలవంతంగా ఒకే అభ్యర్థిని రుద్దడం కంటే, కొన్నిచోట్ల 'స్నేహపూర్వక పోటీలకు' మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే, ఈ పోటీల్లో హద్దులు దాటకుండా చూసుకోవడం, ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీకి రాజకీయ మైలేజ్ దక్కకుండా జాగ్రత్తపడటం అత్యవసరం. కూటమిలో ఎప్పుడు గ్యాప్ వ‌స్తుందా ? అని వైసీపీ కాచుకుని ఉంది. నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగి ముందస్తు సర్దుబాట్లు, నామినేటెడ్ పదవుల హామీలతో అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. అయితే లోక‌ల్ నాయ‌కులు ఎంత వ‌ర‌కు ఒప్పుకుంటారు ? అ విష‌యంలో బాబుకు, ప‌వ‌న్‌కు చిక్కులు త‌ప్ప‌వా ? అన్న‌ది చూడాలి.