పుష్పక విమానం...ఏపీకి మహర్దశ
పుష్పక విమానాల గురించి పురాణాలలో వినే ఉంటారు. ఎంత మంది ఎక్కినా మరింతమందికి అక్కడ చోటు ఉంటుంది.
By: Satya P | 28 Nov 2025 4:00 AM ISTపుష్పక విమానాల గురించి పురాణాలలో వినే ఉంటారు. ఎంత మంది ఎక్కినా మరింతమందికి అక్కడ చోటు ఉంటుంది. ఏపీలో కూడా అదే తరహాలో విమాన రంగానికి భారీ ఎత్తున విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం వేగవంతమైన చర్యలను తీసుకుంటోంది. ఏపీలో రానున్న రోజులలో జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న యాక్షన్ ప్లాన్ ఉంది. ఇందులో భాగంగా వివిధ దశలలో వీలైనన్ని విమానాశ్రయాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఏపీకి చెందిన వారే పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో ఏపీలో పెద్ద ఎత్తున విమానాలు ఎగరబోతున్నాయి.
కొత్తగా మరో ఆరు :
ఏపీలో కొత్తగా మరో ఆరు విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయబోతున్నారు. వీటి నిర్మాణం వీలైనంత త్వరలో ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే భోగాపురం విమాశ్రయం ఇంటర్నేషనల్ రేంజిలో తయారు కాబోతోంది. శ్రీకాకుళంలో కార్గో ఎయిర్ పోర్టు కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. రానున్న రోజులలో టైర్ టూ సిటీలలో ఈ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు.
మిడిల్ క్లాస్ కోసమే :
విమానాలు ఇప్పటిదాకా హైయర్ క్లాస్, అలాగే హైయర్ మిడిల్ క్లాస్ వారికి అందుబాటులో ఉన్నాయి. అయితే రానున్న కాలంలో పెరిగే ఎయిర్ ట్రాఫిక్ జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేఅయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. దాంతో పాటుగా మిడిల్ క్లాస్ ని కూడా విమానం ఎక్కించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అన్నీ వీలు అయితే ఏపీలో ఉన్న కోట్లాది మందికి విమానం ఒక సాధారణ ప్రయాణ సాధనంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.
కేంద్రం ఫోకస్ :
ఇక దేశంలో చూసినా కేంద్ర ప్రభుత్వం సైతం విమాన యాన రంగం మీద పూర్తి దృష్టి పెట్టింది. అనేక రాష్ట్రాలలో కొత్తగా విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మూడవ అతి పెద్దదిగా మారిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దానిని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది.
గతానికి భిన్నంగా :
గతానికి భిన్నంగా భారతదేశ విమానయాన రంగం వేగంగా విస్తరించడానికి అవకాశాలు ఇపుడు మెరుగు అయ్యాయి. అంతే కాదు ఉపాధి కల్పనకు సైతం ఈ రంగం కీలకంగా రానున్న రోజులలో మారబోతోంది. రానున్న రోజులలో యువతకు హైటెక్ ఏరోస్పేస్ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతకంతకు దేశంలో విమాన ప్రయాణానికి ప్రాధాన్యత పెరుగుతూనే ఉందని గుర్తు చేస్తున్నారు. ఇక ఈ అవసరాన్ని తీర్చడానికి విమానయాన సంస్థలు మరింతగా సేవలను విస్తరింపజేస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఏపీలో పెద్ద ఎత్తున విమానయాన రంగం అభివృద్ధి చెందనుంది అంటున్నారు.
