Begin typing your search above and press return to search.

కేంద్ర నిధులు నూరు శాతం తెచ్చిన కూటమి

కేంద్ర ప్రభుత్వం నుంచి నూరు శాతం నిధులు తెచ్చుకున్న మూడవ రాష్ట్రంగా ఏపీ ఉందని అంటున్నారు.

By:  Satya P   |   14 Jan 2026 7:00 AM IST
కేంద్ర నిధులు నూరు శాతం తెచ్చిన కూటమి
X

కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను సమర్ధంగా రాబట్టడం ఒక ప్రతిభ. సమర్ధత కూడా. ఆ విధంగా చూస్తే ఎన్నో కేంద్ర ప్రభుత్వ పధకాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని వాటి విషయంలో పదే పదే అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తూ ఎప్పటికపుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగే వివరాలు ఇస్తూ నిధులను రాబట్టుకోవడం అంటే గ్రేట్ అని చెప్పాలి. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి కానీ అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులను పూర్తిగా తెచ్చుకోలేకపోతాయి. దానికి కారణం కేంద్రం నిధులు ఇవ్వదని కాదు, అడిగిన వివరాలు ఇవ్వాలి, సకాలంలో అన్నీ పంపించేలా చూసుకోవాలి.

ఆఖరి విడత సైతం :

ఇదిలా ఉంటే ఏపీకి రావాల్సిన ఆఖరి విడత నిధులు సైతం వచ్చేశాయి. అలా రాష్ట్రానికి రూ. 567 కోట్ల గ్రాంటుని తాజాగా కేంద్రం విడుద‌ల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార‌సు మేర‌కు ఆరోగ్య రంగానికి ఆఖ‌రి విడ‌త నిధుల విడుద‌ల‌ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ ప్ర‌భుత్వ కృషికి కేంద్రం గుర్తింపుగా దీనిని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య రంగం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కేంద్ర నిధులను వినియోగిస్తున్న తీరుతోనే ఈ నిధులు మొత్తంగా విడుదల అయ్యాయని అంటున్నారు.

మూడవ రాష్ట్రంగా ఏపీ :

కేంద్ర ప్రభుత్వం నుంచి నూరు శాతం నిధులు తెచ్చుకున్న మూడవ రాష్ట్రంగా ఏపీ ఉందని అంటున్నారు. ఏపీతో పాటుగా త‌మిళ‌నాడు, త్రిపుర రాష్ట్రాలే నూరు శాతం నిధులు అందుకున్న జాబితాలో ఉన్నాయి. ఇక కూటమి ప్రభుత్వం గ‌త 19 నెలల కాలంలో 48 శాతం నిధుల‌ను వైద్యారోగ్య శాఖ‌ కోసం వెచ్చించిందని అధికారులు చెబుతున్నారు.

ఏపీ ప్రాధాన్యత :

దేశంలో ఆరోగ్య రంగానికి రాష్ట్రాల వారీగా కేటాయించ‌బ‌డిన 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను పూర్థి స్థాయిలో సాధించిన ఘ‌న‌త రాష్ట్రానికి ద‌క్కింద‌ని, ఇది సంతోషించ‌ద‌గిన విష‌య‌మ‌ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగానికి 15వ ఆర్థిక సంఘం సిఫార‌సు చేసిన మొత్తం రూ.2,600 కోట్ల గ్రాంటును పూర్తిగా పొంద‌టంలో రాష్ట్రం స‌ఫ‌లీకృత‌మైంది. ఇందులో భాగంగా ఐద‌వ ఆఖ‌రి విడ‌త‌గా రూ.567.40 కోట్ల గ్రాంటును ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి కేంద్రం రాష్ట్రానికి సోమ‌వారం నాడు విడుద‌ల చేసిన‌ట్లుగా వైద్య మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చెప్పుకొచ్చారు.

పనితీరు ఆధారంగా :

కేంద్ర నిధులు సాధించ‌డంలోనూ వాటి వినియోగంలోనూ వైద్యారోగ్య శాఖ మంచి ప‌నితీరు క‌న‌ప‌రిచిందని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల‌కు అవ‌స‌రాల మేర‌కు భ‌వ‌నాల నిర్మాణంతో పాటు డ‌యాగ్నోస్టిక్ సేవ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డానికి, బ్లాక్ లెవ‌ల్ ప‌బ్లిక్ హెల్త్ లేబ‌రెట‌రీల ఏర్పాటుకు 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను ప్రభుత్వం వినియోగిస్తుంది.