మూడు వైపుల నుంచి వైసీపీని వాయించేస్తున్నారుగా !
వైసీపీకి 2014 నుంచి 2019 వేరు, 2024 తర్వాత వేరు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఏపీలో కనిపిస్తోంది.
By: Satya P | 15 Sept 2025 9:27 AM ISTవైసీపీకి 2014 నుంచి 2019 వేరు, 2024 తర్వాత వేరు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఏపీలో కనిపిస్తోంది. గతంలో అయితే ఎక్కువగా తెలుగుదేశం పార్టీతోనే వైసీపీకి టగ్ ఆఫ్ వార్ సాగేది. వారిని వీరు వీరిని వారు అనుకుంటూ భారీ ఎత్తున మాటల యుద్ధం చేసేవారు. జనసేన అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగకపోవడం వల్ల అప్పుడప్పుడు మాత్రమే వైసీపీ మీద విమర్శలు చేసేది. బీజేపీ సన్నసన్నగా మాట్లాడుతూ వచ్చేది అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇపుడు అసలు కధ మొదలైంది అని అంటున్నారు.
మీటింగ్ అంటే షాకే :
ఏపీలో కూటమి పార్టీల మీటింగ్ అంటే వైసీపీకి షాకే అని అంటున్నారు. నిన్నటికి నిన్న అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్ పెట్టి వైసీపీని మూడు పార్టీల నాయకులూ ఘాటుగా విమర్శించేశారు. ఆ మీటింగ్ అయింది అనుకుంటే విశాఖలో ఆదివారం విడిగా జరిగిన బీజేపీ మీటింగులో సైతం వైసీపీ మీదనే వాడి వేడి విమర్శలు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వైసీపీని ఎన్ని విధాలుగా అనాలో అన్నీ అనేసి మీటింగ్ ముగించారు దాంతో వైసీపీకి ఇది ఒక విధంగా చెవులు మోతెక్కించే విమర్శలుగా మారాయి అంటున్నారు.
జనసేన అస్త్రాలు అన్నీ :
ఇక విశాఖలో ఆగస్ట్ 30న జరిగిన జనసేన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వైసీపీనే టార్గెట్ చేశారు. అరాచక పాలన అంటూ ఆయన తీవ్రంగానే విమర్శించారు. ఏపీలో గత అయిదేళ్ళ అనుభవాలు వద్దే వద్దని పార్టీ జనాలకు చెబుతూనే సాదర జనాలకు కూడా హితోపదేశం చేశారు. అలా జనసేన శూలాలు వైసీపీని విపరీతంగానే గుచ్చుకున్నాయి.
టీడీపీ నుంచి నిప్పులే :
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి అను నిత్యం నిప్పులే కురుస్తాయని అంటున్నారు. ఆ పార్టీ నుంచి చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తారు. మీడియా సమావేశాల నుంచి పబ్లిక్ మీటింగ్స్ నుంచి ఏ వేదిక అయినా అయిదేళ్ళ అరాచక పాలన అని గుర్తుకు తెస్తూనే ఉంటారు ఇలా మూడు పార్టీలు కలసి కట్టుగానూ విడివిడిగానూ వాయించేస్తూంటే వైసీపీ ఒంటరిగానే సౌండ్ చేయాల్సి వస్తోంది అని అంటున్నారు. వైసీపీలో లోపం ఏంటి అంటే ఎవరు పార్టీని విమర్శించినా వెంటనే కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడం.
ఇలా వంతుల వారీగా విడిగా కలివిడిగా కూటమి అంతా కలసి వైసీపీని ఊపిరాడనీయకుండా విమర్శల జడివాన కురిపించేస్తూంటే వైసీపీ మీద జనాలకు కచ్చితంగా ఒక అభిప్రాయం ఏర్పడుతూ అది బలపడుతూ పోతుందని అంటున్నారు. స్ట్రాంగ్ గా కౌంటర్ చేయకపోతే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అయితే కేంద్రంలో రాష్ట్రంలో బలంగా ఉంటూ కూటమిగా కలిసికట్టుగా ముందుకు వస్తున్న ఈ మూడు పార్టీలని నియంత్రించాలంటే భారీ సవాలే అని అంటున్నారు. మరి రాజకీయంగా సరికొత్త వ్యూహాలు అయితే వైసీపీ రూపొందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది మరి.
