ఏపీలో అకేషనల్ నేతలు.. ఇలా వచ్చి అలా మాయం.. !
రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన మూడు పార్టీలలోను కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.
By: Garuda Media | 5 Aug 2025 8:00 PM ISTరాష్ట్రవ్యాప్తంగా కీలకమైన మూడు పార్టీలలోను కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. అధికార టిడిపి, జనసేన పార్టీలు సహా ప్రతిపక్షం వైసిపి లోను కొందరు నాయకులు అకేషనల్ గా వచ్చి కార్యక్రమాలను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అనంతరం.. మళ్లీ తమ తమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల చేపట్టే కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు టిడిపి చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
దీంతో నాయకులు అందరూ.. పార్టీ కోసం పనిచేస్తామని చంద్రబాబు ముందు చెప్పుకొచ్చారు. అనంతర పరిణామాల్లో వారు ఎక్కడా కనిపించలేదు. ఇది రాజకీయంగా పార్టీని కొంత ఇబ్బందికి గురి చేసింది. అంతర్గత విభేదాలు ఎలా ఉన్నా పార్టీ పరంగా నాయకులు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు ముందు ఒక రకంగా తర్వాత ఒకరకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. అకేషనల్ గా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత వారి వారి పనుల్లో ఉండి పోవడం సర్వసాధారణంగా మారింది.
ఇక జనసేన విషయానికొస్తే ఈ పార్టీలోనూ చాలామంది నేతలు పవన్ వస్తే బయటకు వస్తున్నారు. లేకపోతే మౌనంగా ఉంటున్నారు. వాస్తవానికి పార్టీ తరపున ప్రస్తుతం ప్రత్యేక కార్యక్రమాలు ఏవి జరగకపోయినా పార్టీ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. రేషన్ దుకాణాలు, అలాగే డిజిటల్ రేషన్ కార్డులు, అటవీ సంరక్షణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వంటివి పవన్ కళ్యాణ్ ప్రధానంగా ప్రచారం చేయాలని నాయకులకు కొన్నాళ్ల కిందట చెప్పారు. అప్పట్లో నాయకులు అందరూ కూడా జై కొట్టారు. జనంలోకి వెళ్తామన్నారు.
కానీ ఎమ్మెల్యేలు, ఎంపీల మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పార్టీకి కీలకమైన నాయకులు సైలెంట్ అయిపోయారు. ఈ పరిణామం కూడా జనసేన లో ఇబ్బందిగా మారి ంది. ఇక వైసిపి విషయానికి వస్తే చంద్రబాబు మేనిఫెస్టో రీ కాల్ చేస్తూ ప్రజల్లో తిరగాలని పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా జగన్ పిలుపునిచ్చారు. ఆ రోజు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు అందరూ వచ్చారు. జగన్ చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్తామన్నారు. కానీ, ఆ తర్వాత మాత్రం ఒకరిద్దరు తప్ప ఎవరూ ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపించలేదు.
అంటే ఒకరకంగా చెప్పాలంటే ఈ నాయకులు అకేషనల్ గా మాత్రమే ఉపయోగపడుతున్నారన్నది కనిపిస్తోంది. ఏదైనా అధినాయకులు పాల్గొన్న కార్యక్రమాలకు రావటం ఫోటోలు దిగడం, వీడియోలో కనిపించడం ఆ తర్వాత మళ్లీ తమ తమ వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగితేలుతున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇట్లాంటి పరిణామాలు ఏ పార్టీకి మంచిది కాదు. ఏదైనా అంతర్గత విభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలి. సమస్యలు ఉంటే చర్చించుకుని సానుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేయాలి. అని అకేషనల్ గా కార్యక్రమాల్లో పాల్గొంటామని అన్నట్టుగా వ్యవహరించటం సరికాదన్నది ఆయా పార్టీల్లోని సీనియర్లు చెబుతున్న మాట.
