వైసీపీ...నాడు ఫైర్...ఇప్పుడు మిస్ ఫైర్
అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వైసీపీ చేసిన మొదటి తప్పు అని అంటున్నారు. అలా మొదలైన వైసీపీ విపక్ష రాజకీయం కాస్తా ఇపుడు మరింతగా ఇబ్బందులు పడుతూ లేస్తూ సాగుతోంది అని అంటున్నారు.
By: Satya P | 11 Jan 2026 10:00 AM ISTఒక రాజకీయ పార్టీ అంటే వ్యూహాలు ఉండాలి. అలాగే ఏది మాట్లాడినా జనంలో రికార్డు అవుతుంది. దాంతో సంయమనంతో వ్యవహరించాలి. అంతే కాదు ఇది డిజిటల్ యుగం, సోషల్ మీడియా శకం. అందువల్ల ఎవరూ కూడా మొదట ఒకటి మాట్లాడేసి తరువాత తూచ్ అంటే అసలు కుదరదు. ఇక రాజకీయ పార్టీలు అయితే ఏది పడితే అది మాట్లాడేస్తే కుదరదు. సెంటిమెంట్లు జనాల ఆశలు ఆకాంక్షలు వగైరాలు అన్నీ ముడి పడి ఉంటాయి. పోనీ తెలియక చేసి చేయి ఒళ్ళూ కాల్చుకున్నారు అనుకుంటే ఒక వైపు చేదు అనుభవాలు కళ్ళ ముందే ఉన్నాయి. అయినా సరే కెలుకుతూ పోతామంటే ఎలా అన్నదే ఇపుడు చర్చ. వైసీపీ విషయంలోనే ఈ చర్చ సాగుతోంది.
అన్నీ సెల్ఫ్ గోల్స్ :
వైసీపీ తీరు చూస్తే సెల్ఫ్ గోల్స్ లో రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది అని అంటున్నారు. లేకపోతే అమరావతి లాంటి సున్నితమైన ఇష్యూలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడమేంటి అన్న చర్చ వస్తోంది. అమరావతి రాజధానికి పనికిరాదు అని చెబుతూనే జగన్ ఎన్నో హాట్ కామెంట్స్ చేశారు. నదీ గర్భంలో కడుతున్నారని అన్నారు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు. అంతే కాదు లక్షల కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇలా అనేక విషయాలు మాట్లాడేసిన తరువాత ఆ పార్టీ తూచ్ అంటోంది. తమ ఉద్దేశ్యం అది కాదని చెబుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి కవర్ చేసినా మ్యాటర్ వెరీ క్లియర్ అని జనాలకు అయితే అర్ధం అయిపోంది అని అంటున్నారు.
అసెంబ్లీకి డుమ్మాతో :
అసెంబ్లీకి డుమ్మా కొట్టడం వైసీపీ చేసిన మొదటి తప్పు అని అంటున్నారు. అలా మొదలైన వైసీపీ విపక్ష రాజకీయం కాస్తా ఇపుడు మరింతగా ఇబ్బందులు పడుతూ లేస్తూ సాగుతోంది అని అంటున్నారు. పెట్టుబడుల మీద విమర్శలు పీక్స్ కి చేరుతున్నాయని అంటున్నారు. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పీపీపీకి ఇస్తే ఓకే అంటూ మెడికల్ కాలేజీల విషయంలో పేచీ పెట్టడంతో స్టాండ్ ఏమిటి అని టీడీపీ ప్రశ్నించేలా ఉంది అంటున్నారు. రాజధాని నుంచి డెవలప్మెంట్ నుంచి పెట్టుబడుల సేకరణ పీపీపీ విధానం నుంచి చూస్తే ప్రతీ దానిలోనూ విమర్శలే తప్ప ఆల్టర్నేషన్ ప్లాన్స్ ఏమిటి అన్నది జనాలకు అర్ధం అయ్యేలా వైసీపీ చెప్పలేకపోతోంది అని అంటున్నారు.
డే వన్ నుంచి :
ఇక జగన్ వైఖరి చూస్తే గత ఏణ్ణర్థం విపక్ష హోదాలో ఆయన పెద్దగా జనంలోకి రాలేదని అంటున్నారు. 2014 నుంచి 2019 దాకా చూస్తే జగన్ పెద్దగా అనుభవం లేకపోయినా అసెంబ్లీకి అటెండ్ అయి అధికార టీడీపీని కట్టడి చేసేవారు అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు జనంలోనే అధిక సమయం గడుపుతూ వచ్చారు అని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం తీసుకునే ప్రతీ ఇష్యూ మీద జనం కోణం నుంచి మాట్లాడడం ద్వారా వారి మద్దతు కూడగట్టారని అంటున్నారు రాజకీయ వ్యూహాలు చూసినా కేంద్రంలోని బీజేపీతో సయోధ్య నెరుపుతూ ఆఖరికి టీడీపీ బీజేపీల మధ్య ఎడబాటు తీసుకుని రావడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. కానీ ఇపుడు చూస్తే ఏది పట్టినా ముట్టినా మిస్ ఫైర్ అవుతోంది అని అంటున్నారు. అయినా ఇప్పటికీ మించిపోయినది లేదని ఇంకా చేతిలో మూడేళ్ళకు పైగా సమయం ఉంది కాబట్టి వైసీపీ స్పష్టమైన విధానంతో క్లారిటీతో ప్రజా కోణంతో ప్రతిపక్షంగా వ్యవహరించాలని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీకి వైసీపీకి వెళ్తేనే మొత్తం మైలేజ్ వచ్చేది అని కూడా గుర్తు చేస్తున్నారు.
