స్మార్ట్ చెక్ : ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లపై 'డిజిటల్' నిఘా!
ఐపీఎల్ బెట్టింగ్ దందాను నిలువరించేలా ఏపీ పోలీసులు హైటెక్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తాజాగా గుంటూరులో గుట్టుగా బెట్టింగ్ ఆడుతున్న 15 మందిని అరెస్టు చేశారు.
By: Tupaki Political Desk | 23 April 2026 6:57 PM ISTఐపీఎల్ బెట్టింగ్ దందాను నిలువరించేలా ఏపీ పోలీసులు హైటెక్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తాజాగా గుంటూరులో గుట్టుగా బెట్టింగ్ ఆడుతున్న 15 మందిని అరెస్టు చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు ఆకస్మాత్తుగా దాడులు చేసి అరెస్టు చేయడమే ఈ కేసులో హైలెట్ గా చెబుతున్నారు. అయితే పోలీసులు ఇలా సడన్ ఎంట్రీ ఇవ్వడానికి స్మార్ట్ నిఘాయే కారణమని అంటున్నారు. రాష్ట్రంలో బెట్టింగ్ వల్ల నేరాలు పెరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆధునిక టెక్నాలజీతో వాట్సాప్, టెలిగ్రామ్ సంభాషణలు, అనుమానాస్పద లావాదేవీలపై నిఘా వేస్తున్నట్లు చెబుతున్నారు.
మార్చి చివరి వారంలో మొదలైన ఐపీఎల్ వచ్చే నెల వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ టోర్నమెంట్ ను క్యాష్ చేసుకోడానికి బెట్టింగ్ ముఠాలు చెలరేగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ పోలీసులు స్పెషల్ ఫోకస్ చేశారని చెబుతున్నారు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్ లో బెట్టింగ్ అనుమానంతో పలు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులపై పోలీసులు నిఘా పెంచారు. కొందరు వ్యక్తులు విదేశీ సర్వర్ల ద్వారా నడిచే యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇదే సమయంలో బెట్టింగ్ డబ్బులు కోసం కొందరు దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌ల వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈజీ, ఇనిస్టెంట్ మనీ కోసం అలవాటు పడిన వారే ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు రాష్ట్రంలో అనుమానాస్పద లావాదేవీలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో చైన్ స్నాచింగ్ తోపాటు దొంగతనం నేరాల్లో పట్టుబడిన వారి నుంచి సమాచారం సేకరిస్తూ బెట్టింగ్ ప్రధాన సూత్రధారులను గుర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే గుంటూరులో 15 మందిని పట్టుకున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడైందని అంటున్నారు. చాలామంది బెట్టింగ్ రాయుళ్లు వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా లావాదేవీలు జరిపితే పోలీసులు పట్టుకోలేరని భ్రమపడుతున్నారు. కానీ ఏపీ పోలీసుల సైబర్ వింగ్ ఇప్పుడు అత్యుధునిక సాంకేతికతను వాడుతుండటంతో గుట్టురట్టు అవుతోందని చెబుతున్నారు. ఇక ఇలాంటి కేసుల్లో కేవలం బుకీలే కాకుండా, వాట్సాప్ ద్వారా బెట్టింగ్ కాసే వారిపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా వాట్సాప్ స్క్రీన్ షాట్లనే వాడుతున్నట్లు చెబుతున్నారు.
