Begin typing your search above and press return to search.

ఏక‌గ్రీవం అంటే ఇలానే త‌మ్ముళ్లూ.. !

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, ఏకగ్రీవ పంచాయతీలకు జనాభా ఆధారంగా రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని చోట్ల టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర అవగాహనతో పంచాయతీలను పంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాల పేరుతో వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

By:  Garuda Media   |   16 Nov 2026 2:05 AM IST
ఏక‌గ్రీవం అంటే ఇలానే త‌మ్ముళ్లూ.. !
X

ఏపీలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభం అయింది. తొలి ద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ నెల‌లోనే పోలింగ్ జ‌రుగుతుంది. అయితే.. చాలా మ‌టుకు ఏక‌గ్రీవాలు చేసుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా సూచించారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఏక‌గ్రీవాలు అయ్యే పంచాయ‌తీల‌కు ప్ర‌భుత్వాలు ప్రోత్స‌హ‌కాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే. గ్రామ జనాభా ఆధారంగా ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు రూ. 15 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు నజరానా అందజేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

10 వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీతమైతే అత్యధికంగా రూ. 50 లక్షల వరకు ప్రోత్సాహకం లభి స్తుంది. ఈ నిధులను కేవలం గ్రామాభివృద్ధి, ప్రజోపయోగ పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏక‌గ్రీవా ల‌ను ప్రోత్స‌హిస్తున్న విధానాన్ని ప్ర‌భుత్వ‌మే స్ప‌ష్టం చేసింది. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఈ విధానాన్ని కొంద‌రు టీడీపీ నేత‌లు దారి త‌ప్పిస్తున్నారన్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏక‌గ్రీవాల మాటున వైసీపీ నేత‌ల‌తో క‌లిసిపోయి.. కొన్ని గ్రామాల‌ను టీడీపీ, మ‌రికొన్నింటిని వైసీపీ నేత‌లు ద‌క్కించ‌కుంటున్నారు.

వాస్త‌వానికి ఇలా ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌లిపి ఏక‌గ్రీవాలు చేసుకోవాల‌ని చంద్ర‌బాబు కూడా ఎక్క‌డా చెప్ప‌లేదు. కానీ.. కొంద‌రు నాయ‌కులు అత్యుత్సాహానికి పోతున్నారు. మ‌రికొన్ని చోట్ల వైసీపీ నేత‌ల‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాలు కూట‌మిలోనే చ‌ర్చ‌కు దారితీశాయి. అసలు ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. వైసీపీ, టీడీపీల‌లో కొన్ని కుటుంబాల‌కు చెందిన నాయ‌కులు ఉన్నారు. వీరంతా గ్రామాల‌ను పంచుకుంటున్న తీరు పార్టీలో చ‌ర్చ‌కు వచ్చింది. మ‌రోవైపు ఏక‌గ్రీవాల పేరుతో వేలం పాట‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఇక‌, ఏకగ్రీవాల పేరుతో అభ్యర్థులను బెదిరించినా, బలవంతపెట్టినా లేదా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెచ్చ‌రించింది. బెదిరింపులు ఉన్నట్లు అభ్యర్థులు భావిస్తే, వారు ఎస్పీకి విజ్ఞప్తి చేసి నామినేషన్ల సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్, భద్రత పొందవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఏకగ్రీవ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందంగా, పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. కానీ, దీనికిభిన్నంగా కొంద‌రు ఎమ్మెల్యేలు ద‌గ్గ‌ర ఉండి మ‌రీ.. ఇలా చేయ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది.