మాకు ప్రాధాన్యం లేదా.. 'ఎమ్మెల్యేల' ఆవేదన!
ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన పనులు.. సూచించిన పనులు కూడా అధికారులు చేయడం లేదని చెబుతున్నారు.
By: Garuda Media | 18 Dec 2025 10:00 PM ISTఏపీలో పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన పనులు.. సూచించిన పనులు కూడా అధికారులు చేయడం లేదని చెబుతున్నారు. కనీసం ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు.ప్రస్తుతం కలెక్టర్ల సదస్సు జరుగుతున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. తమ అనుచరులు, పార్టీ కోసం పనిచేసిన వారిని.. ప్రోత్సహించేందుకు చిన్న చిన్న పనులు అప్పగించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.
కానీ, దిగువ స్థాయి అధికారులు ఎమ్మెల్యేల సిఫారసులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాజాగా ఇదే విషయంపై కర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ కార్యాలయానికి లేఖ సంధించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు గా ఉన్న కొంతమందికి సెక్కూరిటీ విధుల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు.
కానీ, అధికారులు ఆ విన్నపాన్ని బుట్టదాఖలు చేశారు. ఆసుపత్రిలో సెక్యూరీటి ఉద్యోగుల విషయంలో కోడుమూరు నియోజకవర్గానికి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని పేర్కొంటూ.. ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సిఫారస్సు చేసినప్పటికీ సెక్యూరీటి ఉద్యోగాలు ఇవ్వడంలేదని ఆయన చెబుతున్నారు. ఆసుపత్రిలో కోడుమూరు నియోజకవర్గం కుడా భాగమని, మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. ఈ సమస్య ఒక్క కోడుమూరులోనే కాదు.. పలు నియోజకవర్గాల్లో ఉంది.
పార్టీ తరఫున అందరికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేని పరిస్థితిలో కొంత మందికి.. స్థానికంగా అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేతగా చంద్రబాబుసూచించారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు.. తమ అనుచరులకు ఉపాధి, ఉద్యోగాలను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అధికారుల స్పందన సరిగా లేకపోవడంతో ఈ వ్యవహారం బెడిసి కొడుతోంది. తాజాగా కలెక్టర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించాలని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు.
