నాడు టీడీపీ వరం.. నేడు అదే శాపం.. ఏంటిది.. ఎందుకు.. ?
రాష్ట్రంలో భూముల రీసర్వే వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వైసీపీ పుట్టి ముంచిన వ్యవహారం కూడా ఇదే!.
By: Garuda Media | 6 Jan 2026 8:00 PM ISTరాష్ట్రంలో భూముల రీసర్వే వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వైసీపీ పుట్టి ముంచిన వ్యవహారం కూడా ఇదే!. ఇది.. అప్పట్లో టీడీపీకి కూటమి పార్టీలకు కూడా వరంగా మారింది. భూముల రీసర్వే చేయడం ద్వారా బ్రిటీష్ హయాం నాటి అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు కల్పించడం.. అదనంగా ఉన్న అన్యాక్రాంత భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం అనేది ప్రధానంగా ఈ కార్యక్రమం కీలక లక్ష్యం. అయితే.. ఇది వైసీపీ హయాంలో వివాదంగా మారింది.
వాస్తవానికి భూముల రీసర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం పూనుకుని దీనిని నిర్వహించాల్సి ఉంది. దీనిలో మంచి చెడులు రాష్ట్ర ప్రభుత్వాలకే చెందుతాయి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు దాస్తున్నాయో కూడా తెలియదు. గతంలో వైసీపీ ప్రభుత్వం తాము తప్ప ఇప్పటి వరకు ఎవరూ చేయలేదంటూ.. భూముల సర్వేను తన ఖాతాలో వేసుకుంది. మంచిదే. కానీ.. ఈ క్రమంలో సర్వే రాళ్లపైనా.. రైతులకు ఇచ్చే పట్టా పుస్తకాలపైనా జగన్ బొమ్మలు వేసుకుంది.
ఇది తీవ్ర వివాదంగా మారి.. ఎన్నికల సమయంలో దుమ్మురేపింది. ఫలితంగా వైసీపీపై గ్రామ స్థాయిలో వ్యతిరేకత పెల్లుబికింది. ఇది ఓటమి దిశగా పార్టీని వడివడిగా అడుగులు వేయించింది. ఇక, ఇప్పుడు అదే కార్యక్రమాన్ని చేపట్టక తప్పదన్న విషయం గ్రహించిన కూటమి ప్రభుత్వం కూడా.. కొన్నాళ్లుగా అదే పనిచేస్తోంది. కానీ, వైసీపీ హయాంలో ప్రధానంగా జరిగిన తప్పులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీకి శాపంగా మారింది.
భూముల కొలతల్లోనే.. తప్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వెనుక బడా నాయకులు ఉంటున్నార న్నది వాదన. గతంలో వైసీపీ నాయకులు ఉంటే.. ప్రస్తుతం టీడీపీ నేతలు ఉన్నారు అంతే తేడా. కానీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులు మాత్రం యథాతథం. దీంతో వైసీపీ ప్రభుత్వం పై ఏర్పడిన అభిప్రాయమే ఇప్పుడు కూడా ఏర్పడుతోంది. దీంతో రెవెన్యూ శాఖపై ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. మరోవైపు.. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలన్న షరతు ఉంది. సో.. మొత్తంగా ముందుకు వెళ్తే ఒక సమస్య.. వెనక్కి వస్తే.. మరో సమస్య అన్నట్టుగా సర్వే వ్యవహారం మారిపోయింది.
