Begin typing your search above and press return to search.

చంద్రబాబు కేసులపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై గతంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం కేసుల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Political Desk   |   20 Jan 2026 6:11 PM IST
చంద్రబాబు కేసులపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
X

ముఖ్యమంత్రి చంద్రబాబుపై గతంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం కేసుల మూసివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో హైకోర్టుకు నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరగగా, ఉభయ పక్షాల నుంచి గట్టి వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబుపై కేసులను ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని కోర్టుకు నివేదిక రూపంలో తెలియజేయాలని హైకోర్టు ధర్మాసనం కోరడం రాజకీయంగా చర్చనీయాంశమైందని అంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు అవినీతి కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ అవినీతి జరిగిందని నాటి ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. ఏసీబీతో విచారణ చేయించారు. సీఐడీకి కేసును బదిలీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్టు కావడం, 53 రోజులు జైలుకు వెళ్లడం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో తనపై నమోదైన కేసుల నుంచి బయటపడ్డారు.

సీఎంపై గతంలో నమోదు చేసిన కేసులకు ఆధారాలు లేవని అప్పట్లో కేసు పెట్టిన వారు ఉపసంహరించుకోవడంతోపాటు, ప్రస్తుతం ఆయా కార్పొరేషన్ల బాధ్యతలు చూస్తున్నవారు కూడా నివేదికలు సమర్పించడంతో ఏసీబీ కోర్టు ఆయా కేసులను కొట్టివేసింది. అయితే ఇలా ఏకపక్షంగా కేసులను కొట్టివేయడాన్ని ప్రతిపక్షం వైసీపీ తప్పుపడుతోంది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా, అధికారులను బెదిరించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడుతోంది. మరోవైపు తాము మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబుపై కేసులను తిరగతోడతామని హెచ్చరిస్తోంది.

ఇలాంటి సమయంలో ప్రతిపక్షం లేవనెత్తిన అభ్యంతరాలను ప్రస్తావిస్తూ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు చంద్రబాబుపై కేసులను ఉపసంహరిస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన ఫైనల్ రిపోర్టు కోసం పిటిషనర్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన థర్డ్ పార్టీ కావడం వల్ల సీఐడీ ఫైనల్ రిపోర్టు ఇవ్వలేమని ఏసీబీ కోర్టు తేల్చిచెప్పింది. దీంతో చంద్రబాబు కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబుపై నమోదైన కేసులను విచారించేందుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఉండగా, ఏసీబీ కోర్టు హడావిడిగా కేసులను కొట్టివేయడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పు ప్రకారం ప్రజాప్రతినిధులపై కేసులను విజయవాడలో ఉన్న ప్రత్యేక కోర్టు మాత్రమే విచారించి నిర్ణయం తీసుకోవాల్సివుందని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఏసీబీ కోర్టు తమ పరిధి కాకపోయినా హడావిడిగా కేసులను మూసివేయడాన్ని ఆక్షేపించారు. సీఆర్పీసీ - 164 వాంగ్మూలం ఇచ్చినప్పటికీ అవి పరిగణనలోకి తీసుకోకుండా ఏసీబీ న్యాయమూర్తి కేసులను మూసివేశారని, ఏపీ సీఐడీ ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్టును ఏసీబీ కోర్టు అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. గంటల వ్యవధిలోనే కేసులను మూసివేయడం చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగం అంటూ న్యాయవాది తన వాదనలు వినిపించారు. అనంతరం కేసుల వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చేనెల 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.