Begin typing your search above and press return to search.

వైసీపీకి తోడుగా కూటమి ఎమ్మెల్యేలు !

ఏడాదిలో కేవలం 45 రోజుల దాకా మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నాం, ఈ సమయంలో కూడా రాకపోతే ఎలా అని ఆయన అంటూ వచ్చారు.

By:  Satya P   |   19 Sept 2025 12:32 AM IST
వైసీపీకి తోడుగా కూటమి ఎమ్మెల్యేలు !
X

చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు హాజరు కావాలి. ప్రజా సమస్యలను అక్కడ చర్చించాలి. ఇది కదా ప్రజాస్వామ్యానికి ఒక అందం, అర్ధం. గతంలో ఇదే జరిగేది, వయసు మీద పడుతున్నా చాలా మంది సీనియర్లు సభకు వచ్చేవారు. తమ మేధస్సుని పదుని పెట్టి మంచి సలహా సూచనలు ప్రభుత్వానికి ఇచ్చేవారు. తాము అధికారంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా తమ సీటు ఎక్కడ హోదా ఏమిటి ఇత్యాది వాటిని అన్నీ వారు ఏ రోజూ చూసుకోలేదు. ప్రజలకు బాధ్యులం అన్న ఒక్క మాట మీదనే నిలబడ్డారు. ప్రజాస్వామ్యానికి వేదిక పవిత్ర ఆలయం అసెంబ్లీ అని బలంగా నమ్మారు. కానీ ఇపుడు చూస్తూంటే పూర్తిగా అంతా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

మూడొంతులు ఖాళీలు :

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. దీని మీద గత కొన్నాళ్ళుగా చర్చ కూడా సాగింది. దాంతో సభలో కీలక బిల్లులు ప్రవేశపెడతారు ఈసారి ఆసక్తికరంగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్యన మొదలైన సభ తొలి రోజే షాక్ తినిపించింది. మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది దాకా ఉంటే సభకు హాజరైన వారు అచ్చంగా 45 మంది మాత్రమే. అంటే నాలుగవ వంతు అన్న మాట. మిగిలిన సీట్లు అన్నీ ఖాళీగా దర్శనం ఇవ్వడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అయితే ఒకింత నిరాశ చెందాల్సిన పరిస్థితిగా ఈ హాజరు ఉంది అని అంటున్నారు.

అదే పనిగా చెబుతున్నా :

గత కొద్ది రోజులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతీ వేదిక మీద ఇదే మాట చెబుతూ వచ్చారు. ఏడాదిలో కేవలం 45 రోజుల దాకా మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నాం, ఈ సమయంలో కూడా రాకపోతే ఎలా అని ఆయన అంటూ వచ్చారు. అంతే కాదు ప్రజా సమస్యల పరిష్కారానికి సభ వేదికగా ఉంటుంది నియోజకవర్గంలో ప్రజలు కూడా ఇదే ఆశిస్తారు అని కూడా చెప్పారు. ఆయన వైసీపీకి చెబుతున్నట్లుగానే ఉన్నా మొత్తం సభ్యులు అందరికీ అదే విధంగా చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సభకు సభ్యులు అంతా రావాలని చెబుతూనే ఉన్నారు. కానీ తీరా చూస్తే అసెంబ్లీ రైనీ సెషన్ తొలిరోజు సీన్ అలా ఉంది అని అంటున్నారు.

వైసీపీని నిందిస్తున్న నేపథ్యం :

ఇక కూటమి పార్టీల నేతలు వైసీపీని తరచూ విమర్శిస్తుంటారు. సభకు హాజరు కావడం లేదని ప్రజా సమస్యల పట్ల చిత్త శుద్ధి నిబద్ధత లేదని అంటూంటారు. కానీ ఇపుడు కూటమి ఎమ్మెల్యేలే అత్యధికులు సభకు గైర్ హాజరు కావడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అని అంటున్నారు. ఈ ప్రశ్నలు సగటు జనం నుంచి కూడా వస్తున్నారు. సగటున రెండు లక్షల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తారు. అలా ఎంతో కీలకమైన ప్రజా ప్రతినిధిగా ఉంటున్న వారు సభకు రాకుండా ఏమి చేస్తున్నారు ఇంతకంటే వేరే ముఖ్య కార్యక్రమాలు ఏమి ఉంటాయని కూడా అంటున్నారు. ఈ రకంగా సభలు పలుచగా ఉండడం ఎమ్మెల్యేలలో నెలకొన్న జవాబుదారీతనం లేని సంగతిని తెలియచేస్తోంది అని అంటున్నారు. ఊహించినట్టుగా ఎటూ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు, వారికి తోడు అన్నట్లుగా కూటమి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాకపోతే ఎలా అన్నదే ప్రశ్నగా ఉంది. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలు పూర్తిగా హాజరు అయ్యేలా ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

సభ కుదింపు కూడా :

ఇంకో వైపు చూస్తే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పది రోజుల నుంచి ఎనిమిది రోజులకు కుదించారు. మొదట అనుకున్న ప్రకారం చూస్తే ఈ నెల 30 దాకా సాగాల్సి ఉంది. అయితే దానిని 27వ తేదీతోనే ముగిస్తున్నారు. సభలో నాలుగు కీలక బిల్లులను ఆమోదిస్తారు అని అంటున్నారు. రానున్న రోజులలో అయినా సభ్యుల హాజరీ పెరుగుతుందేమో చూడాలి మరి.