Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ టు అంటార్కిటికా చారిత్రక బంధం.. రాజమౌళి వెండితెర అద్భుతానికి సరికొత్త ఇంధనమా?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  A.N.Kumar   |   18 May 2026 6:35 PM IST
ఆంధ్రప్రదేశ్ టు అంటార్కిటికా చారిత్రక బంధం.. రాజమౌళి వెండితెర అద్భుతానికి సరికొత్త ఇంధనమా?
X

మంచు ఖండం అంటార్కిటికాకు.. మన ఉత్తరాంధ్ర ‘సాలూరు’కు మధ్య కోట్ల సంవత్సరాల నాటి ‘రాతి బంధం’ ఉందన్న భౌగోళిక నిజం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. అయితే ప్రకృతి దాచిన ఈ కాలగర్భ రహస్యాన్ని గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి విజువల్ వండర్‌లో ‘మాస్టర్ స్ట్రోక్’గా మార్చుకోబోతున్నారా? ‘గోండ్వానా’ కనెక్షన్‌తో మహేష్ బాబు అడ్వెంచర్ మూవీ స్క్రిప్ట్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లనుందా అంటే.. అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు..

భారత భౌగోళిక చరిత్ర పుటల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. కాలం సృష్టించిన భౌగోళిక వింతల్లోనే అత్యంత ఆశ్చర్యకరమైన అరుదైన మైలురాయి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతమైన విజయనగరం (సాలూరు) , మంచు ఖండం అంటార్కిటికాల మధ్య కోట్ల సంవత్సరాల నాటి విడదీయరాని అనుబంధాన్ని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఈ అద్భుత ఆవిష్కరణ కేవలం సైన్స్ ప్రపంచానికే పరిమితం కాకుండా భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్తున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి దృశ్యకావ్యానికి సరికొత్త ఊహాశక్తిని , లోతును ఇచ్చేలా కనిపిస్తోంది.

కాలగర్భంలో కలిసిపోయిన రేనర్–ఈస్ట్రన్ ఘాట్స్ బంధం

సుమారు 130 నుంచి 150 మిలియన్ సంవత్సరాల క్రితం.. నేటి భారతదేశం, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలన్నీ కలిసి ‘గోండ్వానా’ అనే ఒకే ఒక్క మహా భూభాగంగా విలసిల్లాయి. కాలక్రమేణా జరిగిన భౌగోళిక మార్పుల వల్ల ఇవి విడిపోయినప్పటికీ ఆనాటి బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి విజయనగరం-సాలూరు ప్రాంతంలోని శిలలు. ఇక్కడి రాళ్ల వయస్సు, వాటిలోని ఖనిజాల నిర్మాణం, భౌగోళిక లక్షణాలు.. అంటార్కిటికాలో లభించిన పురాతన రాళ్లతో వందకు వంద శాతం సరిపోలడం గమనార్హం. శాస్త్రవేత్తలు వీటిని “ ఈస్ట్రన్ ఘాట్స్ ఒరోజెన్” అనే ఒకే పర్వత శ్రేణికి చెందిన భాగాలుగా గుర్తించారు. అంటే ఒకప్పుడు అంటార్కిటికా మంచు శిఖరాలు, మన తూర్పు కనుమలు ఒకే తల్లి పిల్లలన్నమాట!

రాజమౌళి - మహేష్ బాబు అడ్వెంచర్ మూవీకి బిగ్ ప్లస్!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథాంశం కోసం చిత్ర బృందం అంటార్కిటికా నేపథ్యంలో కీలకమైన పరిశోధనలు, సన్నివేశాల చిత్రీకరణను యోచిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌కు మంచు ఖండంతో ఉన్న ఈ ప్రాచీన అనుబంధం తెరపైకి రావడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ రాజమౌళి తన కథలో ఈ 'గోండ్వానా' కనెక్షన్‌ను గనుక జోడిస్తే సినిమాకు చాలా ప్లస్ అవుతుందనిచెప్పొచ్చు. కేవలం ఒక కల్పిత అడ్వెంచర్ కథలా కాకుండా మన సొంత గడ్డకు ఉన్న చారిత్రక, శాస్త్రీయ నిజాలను ముడిపెట్టడం వల్ల కథకు అద్భుతమైన లోతు వస్తుంది. విజయనగరం అడవులు, కొండల నుంచి అంటార్కిటికా మంచు సామ్రాజ్యం వరకు సాగే ప్రయాణాన్ని స్క్రీన్ మీద చూపిస్తే, ప్రేక్షకుడికి ఒక సరికొత్త భౌగోళిక ప్రయాణానుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని చూపించడం ద్వారా అటు ప్రపంచ ప్రేక్షకులను, ఇటు స్థానిక ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించవచ్చు.

సైన్స్, హిస్టరీల అద్భుత సమ్మేళనం

చరిత్రను, పురాణాలను సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా రోమాంచితంగా తెరకెక్కించడంలో రాజమౌళి దిట్ట. గతంలో 'మగధీర', 'బాహుబలి' సినిమాల్లో ఊహాజనిత ప్రపంచాలను సృష్టించిన జక్కన్న.. ఈసారి భౌగోళిక శాస్త్రం, చరిత్ర, సాహసాలను మేళవించి ఒక సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ భౌగోళిక చర్చల్లో మారుమోగడం ఒక మైలురాయి అయితే.. అదే అంశం రేపటి భారతీయ సినిమా రారాజు చేతుల్లో పడితే అది ఒక సంచలన దృశ్యకావ్యంగా మారడం ఖాయం. ప్రకృతి దాచిన ఈ కోట్ల సంవత్సరాల నాటి రహస్యం వెండితెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి!