కూటమికి వదిలేసినట్లేనా...వైసీపీ సంచలనమేనా ?
ఏపీలో కొత్త ఏడాది సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించనుందా లేదా అన్నది తేలాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే.
By: Satya P | 1 Dec 2025 9:02 AM ISTఏపీలో కొత్త ఏడాది సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించనుందా లేదా అన్నది తేలాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే. ఏపీలో రాజకీయం ఎపుడూ వేడిగానే ఉంటుంది కదా మళ్ళీ కొత్తగా ఏమిటి అనుకోవచ్చు. మామూలు సమయంలో వేరు, ఎన్నికల వేళ అయితే అది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగబోతోంది. 2026 వస్తూనే స్థానిక ఎన్నికల సమరానికి తెర తీయనుంది. ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరిగే చాన్స్ ఉంది.
సర్పంచులతో మొదలెట్టి :
ముందుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు, జెండాలు అంతకంటే ఉండవు. కేవలం మద్దతుదారులే కనిపిస్తారు. అలా ఈ ఎన్నికల ఘట్టం పూర్తి అయ్యాక ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు ఉంటాయి. ఇవి రాజకీయంగా గ్రామ సీమల అభిప్రాయాన్ని గట్టిగా వెల్లడిస్తాయి. పైగా మంట పుట్టించే ఎన్నికలుగా ఉంటాయి. ఆ మీదట మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇవి పూర్తిగా అర్బన్ ఓటర్ల మనోగతాన్ని వెల్లడిస్తాయి. ఈ విధంగా జరిగే లోకల్ బాడీ ఫైట్ ఏపీలో రసవత్తరంగా జరగాలీ అంటే కూటమి వర్సెస్ వైసీపీగా భీకర పోరు సాగాల్సి ఉంది.
కూటమి రెడీగా :
ఇక ఏపీలో అధికారంలో కూటమి ఉంది. మూడు ప్రధాన పార్టీలు అందులో ఉన్నాయి. టీడీపీ జనసేన, బీజేపీ కలసికట్టుగా ఉన్నాయి. ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడం అన్నది ఒక విధంగా ఈజీ టాస్క్. పైగా 2024 ఎన్నికల ఫలితాలు కళ్ల ముందు ఉండగానే రెండేళ్ళు తిరగకుండానే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పెద్దగా తేడా వచ్చేది ఉండదని అధికార పార్టీ భావిస్తోంది. ఇక నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు సాధించాలని కూటమి భారీ టార్గెట్ ని పెట్టుకుంది. ఈ ఎన్నికలతో గ్రాస్ రూట్ లెవెల్ లో మరింత బలంగా పాతుకుని పోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయి. అదే సమయంలో క్యాడర్ కి కూడా అధికార పదవులు దక్కే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు పట్టు బిగిస్తున్నాయి.
వైసీపీలో చర్చ :
ఇదిలా ఉంటే వైసీపీలో దీని మీద చర్చ సాగుతోందా లేదా అన్నది అయితే ఇప్పటికీ తెలియడం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎక్కువ వ్యవధి కూడా లేదు వైసీపీ ఓటమి పాలు అయి ఏణ్ణర్థం దాటింది. పైగా అధికారం పోయిన పార్టీ అన్ని విధాలుగా సర్దుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీలో చూస్తే ఆ విధమైన వాతావరణం కనిపించడం లేదు అని అంటున్నారు. అధినేత అడపా దడపా జనంలోకి వెళ్తున్నారు. ఆయన పర్యటనకు జనాలు వస్తున్నారు. అయితే పార్టీలో ప్రతీ నియోజకవర్గం ఇంచార్జిలను సమావేశపరచి వారితో రెగ్యులర్ గా రివ్యూ చేయాల్సి ఉంటుంది. అంతే కాదు పార్టీ పరంగా సరైన దిశా నిర్దేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకుని పోవాల్సి ఉంది. అధికార పార్టీ ఎటూ దూకుడుగా ఉంటుంది కాబట్టి గట్టి అభ్యర్ధులను అన్నింటికీ తట్టుకుని నిలిచే వారిని ఇప్పటి నుంచే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మరి వైసీపీ ఆలోచనలు ఏమిటి అన్నది తెలియడం లేదని అంటున్నారు. అయితే ఎటూ అధికార పార్టీకే మొగ్గు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోటీ చేయకుండా ఉంటేనే మేలు అని భావిస్తున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. జనరల్ ఎలక్షన్స్ మీద టార్గెట్ చేసుకొవడమే బెటర్ అని కనుక ఆలోచిస్తే మాత్రం కూటమికే లోకల్ ఫైట్ ని వదిలేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
