ట్రాన్స్ జెండర్ క్రికెటర్ అనాయా బంగార్ అసలు వివాదమేంటి? ఎందుకింత వ్యతిరేకత?
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనాయా బంగార్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
By: A.N.Kumar | 30 Aug 2026 12:06 PM ISTభారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనాయా బంగార్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆమెకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మహిళల క్రికెట్‌లో ఆడేందుకు మార్గం సుగమం చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మరిజానే కాప్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. కాప్ ఈ నిర్ణయాన్ని “అబ్సల్యూట్లీ రిడిక్యులస్” అంటూ.. ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులు మహిళల క్రికెట్‌లో ఆడటానికి అనుమతించకూడదని అభిప్రాయపడ్డారు.
అసలు అనాయా బంగార్ ఎవరు?
అనాయా బంగార్ గతంలో పురుషుడిగా ఉండేవాడు. ముంబై అండర్-19 క్రికెట్‌లో ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. లింగ మార్పిడి ప్రక్రియ అనంతరం కొంతకాలం పోటీ క్రికెట్‌కు దూరమైన అనాయా.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మళ్లీ తన కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. 2026 మార్చిలో ఆమె జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెప్పింది?
క్రికెట్ ఆస్ట్రేలియా తాజా నిర్ణయం ప్రకారం అనాయా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రీమియర్ క్రికెట్ వంటి కమ్యూనిటీ స్థాయి పోటీల్లో ఆడేందుకు అర్హురాలు. 2027 మార్చి నుంచి ఎలైట్ మహిళల క్రికెట్‌లోనూ పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో ఉమెన్స్ బిగ్ బ్యాష్ లీగ్ కూడా ఉంటుంది. అయితే అర్హత లభించిందంటే ఆమెకు నేరుగా డబ్ల్యూ.బిబిఎల్ లో స్థానం దక్కినట్లు కాదు. ముందుగా పోటీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్, ఫామ్, ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.
సీఏ నిబంధనల ప్రకారం ఎలైట్ మహిళల క్రికెట్‌లో పాల్గొనే ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణి సీరమ్ టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్దేశిత పరిమితిలో ఉంచాలి. కనీసం 12 నెలల పాటు టెస్టోస్టెరాన్ స్థాయి 10 ఎన్ఎంఓఎల్/ఎల్ కంటే తక్కువగా ఉండాలనే నిబంధన ఉంది. అర్హతను కొనసాగించేందుకు అవసరమైన వైద్య, రక్త పరీక్షలు కూడా సమర్పించాల్సి ఉంటుంది.
మరిజానే కాప్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
అనాయాకు ఆస్ట్రేలియా క్రికెట్‌లో అవకాశం కల్పించడంపై కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణుల భాగస్వామ్యం వల్ల పోటీ సమానత్వంపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆమె అభిప్రాయం. ముఖ్యంగా పురుషుల యౌవన దశలో శారీరక మార్పుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుందా? అనే అంశమే ఈ వివాదంలో ప్రధానంగా మారింది. కాప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల క్రీడల్లో ‘ఇన్‌క్లూజన్ వర్సెస్ ఫెయిర్‌నెస్’పై మరోసారి చర్చ మొదలైంది.
అనాయా బంగార్ ఘాటైన సమాధానం
కాప్ వ్యాఖ్యలకు అనాయా కూడా స్పందించారు. తన అర్హతను వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా కాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలు, వైద్య పరీక్షలు, శాస్త్రీయ అంచనాల ఆధారంగా నిర్ణయించారని ఆమె పేర్కొన్నారు. తనను విమర్శించే ముందు సంబంధిత విధానాలు, శాస్త్రీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తన హార్మోన్ థెరపీ అనంతరం శారీరక పరామితులు, టెస్టోస్టెరాన్ స్థాయులు, కండరాల పరిమాణం, స్టామినా వంటి అంశాలను పరీక్షించినట్లు ఆమె వెల్లడించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితి వేరు
ఇక్కడ మరో కీలక విషయం ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనలు ఒకేలా లేవు. ICC ప్రస్తుతం పురుషుల యౌవన దశను అనుభవించిన ట్రాన్స్‌జెండర్ మహిళలను అంతర్జాతీయ మహిళల ఎలైట్ క్రికెట్‌లో పాల్గొనకుండా నిబంధనలు విధించింది. దీంతో ఆస్ట్రేలియాలో దేశీయ క్రికెట్‌కు అనాయాకు లభించిన మార్గం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు అదే అవకాశం ఉంటుందని చెప్పలేం.
ఇప్పుడు అనాయా లక్ష్యం ఏంటి?
ప్రస్తుతం అనాయా ముందు ఉన్న మొదటి లక్ష్యం ఆస్ట్రేలియాలోని క్లబ్, ప్రీమియర్ క్రికెట్‌లో తిరిగి పోటీ క్రికెట్ ఆడటం. అక్కడ తన ఫిట్‌నెస్, ఫామ్, ప్రతిభను నిరూపించుకుని 2027లో డబ్ల్యూబీబీఎల్ అవకాశం దక్కించుకోవాలని ఆమె భావిస్తున్నారు. అయితే చివరికి ఏ జట్టు ఎంపిక చేస్తుందన్నది ఆమె ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది.
అందుకే అనాయా బంగార్ వ్యవహారం ఇప్పుడు ఒక క్రికెటర్ వ్యక్తిగత ప్రయాణాన్ని దాటి.. మహిళల క్రీడల్లో సమానత్వం, పోటీ న్యాయం, వైద్య ప్రమాణాలు, ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై అంతర్జాతీయ చర్చగా మారింది. ఒకవైపు కాప్ వంటి స్టార్ క్రీడాకారిణులు ఫెయిర్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. మరోవైపు అనాయా మాత్రం తాను నిబంధనలను పాటించి అర్హత సాధించానని, ఇక తన ఆటతోనే సమాధానం చెబుతానని స్పష్టం చేస్తున్నారు.
