Begin typing your search above and press return to search.

తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. పెద్దారెడ్డి హౌస్ అరెస్టు

రాజ‌కీయ ఆధిప‌త్యంతో నిత్యం సంఘ‌ర్ష‌ణ‌లకు గుర‌య్యే ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో శుక్ర‌వారం మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

By:  Garuda Media   |   26 Jun 2026 3:23 PM IST
తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. పెద్దారెడ్డి హౌస్ అరెస్టు
X

రాజ‌కీయ ఆధిప‌త్యంతో నిత్యం సంఘ‌ర్ష‌ణ‌లకు గుర‌య్యే ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో శుక్ర‌వారం మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్దిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే.. దీనిని త‌ప్పుబ‌డుతూ.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి పోలీసుల‌పై నిప్పులు చెరిగారు. అత‌నిని అరెస్టు చేయ‌డం కాదు.. ఏం జ‌రుగుతుందో చూడాలంటూ స‌వాల్ రువ్వారు.

ఏం జ‌రిగింది?

తాడిప‌త్రిలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని.. వారికి ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని పేర్కొంటూ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి శుక్ర‌వారం ఉద‌యం స్థానిక గాంధీ బొమ్మ ద‌గ్గ‌ర శాంతియుత ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. అయితే.. దీనికి అనుమ‌తులు లేవ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించిన పెద్దారెడ్డి భారీ ఎత్తున శ్రేణుల‌ను స‌మీక‌రించారు. ఇక‌, ఈ విష‌యం తెలిసిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి.. తాడిప‌త్రిలో పెద్దారెడ్డి ఎలా అడుగు పెడ‌తాడో చూస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌యుద్ధం జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసిన పోలీసులు ఇరు ప‌క్షాల‌ను శాంతిప‌జేసే ప్ర‌య‌త్నాలు చేశారు. అయిన‌ప్ప‌టికీ..ఎవ‌రూ శాంతించ‌లేదు. ఈ నేప‌థ్యంలో పెద్దారెడ్డిని ఇంటి వ‌ద్దే అడ్డుకుని గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులను అడ్డుకునేందుకు వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీ ఎత్తున త‌ర‌లి రావ‌డంతో పోలీసుల‌కు-కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వాదంతోపాటు తోపులాట కూడా జ‌రిగింది. పోలీసు వాహ‌నాల‌కు వైసీపీ కార్య‌క‌ర్త‌లు సిమెంటు బెంచీల‌ను అడ్డు పెట్టారు.

ఇదిలావుంటే.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఇటు పోలీసుల‌పైనా అటు పెద్దారెడ్డిపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పెద్దారెడ్డిపై కేసు పెట్ట‌కుండా ఇంట్లోనే ఉంచ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పెద్దారెడ్డి బ‌య‌ట‌కు వ‌స్తే త‌మ త‌ఢాకా చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య చేశార‌ని, కాళ్లు చేతులు కూడా విర‌గ్గొట్టార‌ని.. అప్పుడు పెద్దారెడ్డి ఏం చేశాడ‌ని ప్ర‌శ్నించారు. ముందుగా టీడీపీ కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి లెంప‌లు వేసుకోవాల‌ని డిమాండ్ చేశారు.