ఇవేం బూతులు దగ్గుపాటి? వైరల్ గా ఆడియో క్లిప్
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందునా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి.
By: Garuda Media | 18 Jan 2026 10:15 AM ISTరాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందునా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. చిన్న తప్పు చాలు.. అప్పటివరకు సాధించిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోవటానికి. ఆ విషయాన్ని అధికారంలో ఉన్న నేతలు అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. అవసరం లేని అహంకారాన్ని తెచ్చి పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొత్త తిప్పలు తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్.
ఇక్కడో విషయాన్ని ముందు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు అన్నంతనే స్వర్గీయ ఎన్టీఆర్ ల్లుడు.. చంద్రబాబు నాయుడు తోడల్లుడి గురించి ఇప్పుడు చెప్పటం లేదు. రాజకీయాల్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావును డాక్టర్ గారు అని వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు చెప్పేది ఆయన గురించి కాదు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలానికి చెందిన ఆయన.. 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పని చేశారు. మొదట్నించి టీడీలో ఉన్న ఆయనకు 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత.. ఐదుసార్లు ఎంపీగా పని చేసిన వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై 23వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందటంతో ఆయన జెయింట్ కిల్లర్ గా అవతరించారు.
రాజకీయాల్లోకి రావటానికి ముందు వ్యాపారవేత్తగా.. రైతుగా సుపరిచితులు. మోకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా పూర్తి చేసిన ఆయన.. నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడన్న పేరుంది. ఇదిలా ఉంటే.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆచితూచి అడుగులు వేస్తే బాగుండేది. కానీ.. అందుకు భిన్నంగా తరచూ ఆయన తన నోటికి పని చెప్పటంతో వివాదాలతో సహవాసం చేసే పరిస్థితి.
జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్లు ఆయన గొంతు పోలిన ఒక ఆడియో క్లిప్ బయటకు రావటంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారి అందరి కంట్లో పడ్డారు. ఈ ఆడియో క్లిప్ ను తప్పు పడుతూ ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఆఫీసు ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సదరు ఆడియో తనది కాదని.. అది రాజకీయ కుట్రగా పేర్కొంటూ వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పి.. సమస్య సమిసిపోయేలా చేసుకున్నారు. అయితే.. ఎన్టీఆర్ నటించిన వార్ 2ను అడ్డుకుంటామన్న ఆడియో మరింత గందరగోళానికి గురి చేసింది.
అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్‌ను ఎమ్మెల్యే అనుచరులు.. ఆయన గన్ మెన్ బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే దగ్గుపాటి గన్ మెన్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు అని ప్రచారం ఉంది.
ఈ వివాదం ఒక కొలిక్కి రాకముందే.. మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలోని ఒక మహిళా డాక్టర్ భర్తను దారుణమైన బూతులతో తిట్టిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. ఆస్రా ఆసుపత్రి యాజమాన్యం కొనుగోలు చేసిన ఒక భవనాన్ని ఎమ్మెల్యే బంధువులు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారని బాధితులు జిల్లా రిజిస్ట్రార్ కు కంప్లైంట్ చేశారు. ఆ సందర్భంగా సుమయ మీడియాతో మాట్లాడుతూ.. తమకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆమె.. ఎమ్మెల్యే బావమరిది అశోక్ ఇందులో ఉన్నట్లుగా చెబుతున్నారంటూ వాపోయారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బూతులు తిట్టిన ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. నువ్వు.. నీ భార్య ఎప్పుడైనా ఎమ్మెల్యేను చూశారా? ఎమ్మెల్యే బావమరిది గురించి మాట్లాడతారా? అంటూ రాయలేని భాషలో బూతులు తిట్టిన ఆడియో క్లిప్ బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఇలా.. తరచూ ఏదో ఒక వివాదంతో తన పేరు ముడిపడుతున్న తీరు.. తనకు నష్టం చేస్తుందన్న విషయాన్ని ఆయన ఎప్పటికి గుర్తిస్తారో?
