సీటు మహిళలకు.. నామినేషన్ పురుషుడికి.. ఇదేం ట్విస్టయ్యా బాబూ!
విడపనకల్లులో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల జాతర సాగుతోంది. సదరు స్థానాన్ని ఎన్నికల కమిషన్ 'జనరల్ మహిళ'కు కేటాయించింది.
By: A.N.Kumar | 24 Oct 2026 9:49 AM ISTఏపీలో ఒకప్పుడు ఉద్భవించిన ‘బ్రహ్మం గారు ఏనాడో చెప్పారయ్యా..’ కలియుగం ఆడమగ తేడాలుండవు.. ఆడవారు రాజ్యాలు ఏలుతారు.. పురుషులను మించి పనులు చేస్తారని.. కానీ ఇలా ఆడవారికి కేటాయించిన సీట్లలో పురుషులు పోటీచేస్తారని మాత్రం చెప్పలేదు.. ఇదో మిస్టరీ.. ఆ మిస్టరీని చూసి నవ్వుకోవడం తప్పితే మనం ఏం చేయలేం..
రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు జరగడం కొత్తేమీ కాదు. కానీ అనంతపురం జిల్లా విడపనకల్లులో జరిగిన ఓ ఘట్టం మాత్రం స్థానికులకు పొట్టచెక్కలయ్యే నవ్వులతో పాటు బోలెడంత ఆశ్చర్యాన్ని పంచింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన నాయకులు చూపించిన ఈ "ప్రత్యేకమైన చాకచక్యానికి" రిటర్నింగ్ అధికారి (ఆర్వో) మొదట్లో మైమరిచిపోయినా.. ఆ తర్వాత మెలకువ వచ్చి షాక్ తిన్నారు.
అసలేం జరిగింది?
విడపనకల్లులో ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల జాతర సాగుతోంది. సదరు స్థానాన్ని ఎన్నికల కమిషన్ 'జనరల్ మహిళ'కు కేటాయించింది. అంటే స్పష్టంగా మహిళా అభ్యర్థులే బరిలో నిలవాలి. కానీ మన జనసేన నేత బెస్త సురేశ్ గారు "జెండర్ ఏదైతేనేం.. పోటీ చేయాలనే ఉత్సాహం ముఖ్యం" అనుకున్నారో ఏమో కానీ... ఏకంగా తనే వెళ్లి నామినేషన్ కాగితాలు ఆర్వో ముందర పెట్టేశారు.
ఇక్కడ అసలైన ట్విస్ట్ అభ్యర్థి ది మాత్రమే కాదు. నామినేషన్లు స్వీకరించే రిటర్నింగ్ అధికారి నాసరరెడ్డి గారు కూడా కాగితాలు తీసి, సంతకాలు చూసి, పత్రాలను భద్రంగా స్వీకరించేశారు. అంతటితో ఆగకుండా "ఇదిగోండి నామినేషన్లు" అంటూ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఆ వివరాలను సగర్వంగా షేర్ చేశారు.
వాట్సాప్ గ్రూప్‌లో వెలుగు చూసిన 'మాస్టర్‌ప్లాన్'
సోషల్ మీడియాలో ఈ విషయం బయటకు రాగానే జనాలు ముక్కున వేలేసుకున్నారు. "ఏంటి సామీ ఇది... మహిళా స్థానంలో పురుషుడికి టికెట్టా? లేక జెండర్ రిజర్వేషన్ల రూల్స్‌లో ఏమైనా కొత్త మార్పులు వచ్చాయా?" అని నెటిజన్లు, స్థానిక రాజకీయనాయకులు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.
సంగతి సగం ఊరంతా తెలిసిపోయాక కథలోని తప్పును గుర్తించిన అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. నామినేషన్ల పరిశీలన సమయానికి వచ్చేసరికి ఆర్వో గారికి జ్ఞానోదయం కలిగింది. "అయ్యో... ఇది మహిళా స్థానం కదా.. ఈయన పురుషుడు కదా!" అని గుర్తించి, చివరికి ఆ నామినేషన్ భారాన్ని తిరస్కరిస్తూ ప్రకటన చేశారు.
ఎన్నికల రూల్స్: స్వీకరణ వేరు... పరిశీలన వేరు!
సాధారణంగా నామినేషన్ ఇచ్చేటప్పుడు ఎవరు వచ్చినా కాగితాలు తీసుకోవడం అధికారుల ప్రాథమిక విధి. కాకపోతే కనీసం ఆ కాగితంపై ఉన్న అభ్యర్థి పురుషుడా, మహిళా అని చూడకుండా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకోవడమే ఇక్కడ నవ్వులపాలైన విషయం. "ముందు కాగితాలు తీసుకోవడం.. తర్వాత నిబంధనలు గుర్తు తెచ్చుకోవడం" అనే చందంగా సాగింది ఈ విడపనకల్లు ఎపిసోడ్.
ఏది ఏమైనా "మహిళలకు రిజర్వ్ చేసిన స్థానంలో పురుషుడు నామినేషన్ వేయడం... దాన్ని ఆఫీసరు గారు తొలుత హ్యాపీగా స్వీకరించడం" అనే ఈ ఘట్టం అనంతపురం పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నియమ నిబంధనల మీద నేతలకూ, అధికారులకూ ఉన్న 'అపారమైన అవగాహన'కి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనమని స్థానికులు చమత్కరిస్తున్నారు!
