అధికారంలో ఉన్నా.. 'అనంత' డౌటేనా.. !
కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూడా వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికై తమ పట్టును నిలుపుకున్నారు.
By: Garuda Media | 12 Sept 2026 7:00 PM ISTఅనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ లో వైసీపీ అధికారంలో(ప్రస్తుతం కాలం తీరింది) ఉంది. కానీ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మాత్రం నాయకులకు గెలుపుపై డౌట్ పట్టుకుంది. గత సాధారణ మున్సిపల్ ఎన్నికలలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 50 డివిజన్లలో 48 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అనంతపురం నగర మేయర్‌గా మహమ్మద్ సలీం వాసీం, డిప్యూటీ మేయర్‌గా దాసరి వాసంతి సాహిత్య బాధ్యతలు నిర్వహించారు.
కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూడా వైసీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికై తమ పట్టును నిలుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తదుపరి స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ వ్యవహారం.. వైసీపీకి ఇబ్బందిగా మారింది. వార్డుల పునర్విభజన జరుగుతుండడంతో తమకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అలానే.. అనంతపురంలో టీడీపీ నేతలు బలంగా ఉండడం.. ప్రతి నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం అర్బన్ స్థానంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయం సాధించారు. ఈయన ఫైర్ బ్రాండ్‌గా మారిపోయింది. దీంతో రాబోయే మున్సిపల్ ఎన్నికలలో నగర పీఠాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ పరిణామంతో కూటమి దూకుడు పెరిగింది. అదేసమయంలో అంతర్గత కుమ్ములాటలను కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఫలితంగా టీడీపీ గెలుపు పక్కా అని.. చంద్రబాబుకు కానుకగా ఇస్తామని చెబుతున్నారు.
మరోవైపు, తమ పట్టును కాపాడుకునేందుకు వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది. అయితే.. కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో అధికార కూటమి దూకుడును ఏ విధంగా ఎదుర్కొంటున్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇరు పక్షాల మధ్య ఉత్కంఠభరితమైన పోరు నెలకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకులు తమ ప్రభావం చూపించేందుకు కూటమిలో ఐక్యంగా ముందుకు కదులుతుండడం వైసీపీని మరింత బెంబేలెత్తిస్తోంది. ఇన్ని అవాంతరాలు దాటుకుని.. ఏ విధంగా ముందుకు సాగుతారన్నది చూడాలి.
