Begin typing your search above and press return to search.

స్థానిక పోరులో 'అనంత' రాజ‌కీయాలు.. !

ఇక‌, అనంత కార్పొరేష‌న్ ప‌రిధిలో స్థానికంగా త‌మ బ‌లం ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్న వ‌ర్గాలు కూడా పెరుగుతున్నాయి.

By:  Garuda Media   |   1 Oct 2026 8:00 PM IST
స్థానిక పోరులో అనంత రాజ‌కీయాలు.. !
X

స్థానిక ఎన్నికల విష‌యంలో అనంత‌పురం జిల్లాలో కూట‌మి పార్టీలు.. ముఖ్యంగా టీడీపీలోనే.. పెద్ద ఎత్తున రాజ‌కీ యాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ద‌ఫా రిజ‌ర్వేష‌న్ ఇంకా ఖ‌రారు కాలేదు. వాస్త‌వానికి అనంపురం కార్పొరేష‌న్ ను ఎప్పుడూ జ‌న‌ర‌ల్‌కు కేటాయిస్తున్నారు. అయితే.. జిల్లాలో మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ ద‌ఫా మ‌హిళ‌ల‌కు అందునా బీసీల‌కు కేటాయించే అవకాశం ఉంద‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. ఆర్య‌వైశ్యులు కూడా త‌మ‌కు కేటాయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

ఇక‌, అనంత కార్పొరేష‌న్ ప‌రిధిలో స్థానికంగా త‌మ బ‌లం ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్న వ‌ర్గాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో.. తొలిసారి బీసీ వ‌ర్గానికి చెందిన ప‌రశురాంకు మేయ‌ర్ పోస్టు ఇచ్చారు. ఆ త‌ర్వాత‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన స్వ‌రూప మ‌హిళా కోటాలో ద‌క్కించుకున్నారు. ఇవి రెండు కూడా.. టీడీపీ పాల‌నా కాలంలోనే జ‌రిగాయి. బీసీలు, క‌మ్మ‌ల డిమాండ్‌ను అప్ప‌ట్లో నెర‌వేర్చారు.

అయితే.. వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ స్థానం జ‌న‌ర‌ల్ అయిన‌ప్ప‌టికీ.. మైనారిటీ ముస్లిం ఓటు బ్యాంకును సొంతం చేసుకునేక్ర‌మంలో వసీంకు మేయర్ పోస్టును క‌ట్ట‌బెట్టారు. అయితే.. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగిందేంట‌న్న‌ది వైసీపీలో అప్ప‌ట్లోనే చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఇప్పుడు త‌మ‌కు కేటాయించాల‌ని ఆర్య వైశ్యులు కోరుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్మ‌, బీసీ, మైనారిటీల‌కు ఇచ్చార‌ని.. కాబ‌ట్టి బ‌లం ఎక్కువ‌గా ఉన్న త‌మ‌కు ఇప్పుడు మేయ‌ర్ పోస్టును ఇవ్వాల‌ని టీడీపీకి అనుకూలంగా ఉన్న వైశ్య సామాజిక వ‌ర్గం ప‌ట్టుబ‌డుతోంది.

ఇదిలావుంటే.. త‌మ‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని బ‌లిజ సామాజిక వ‌ర్గం(కాపుల్లో మ‌రో వ‌ర్గం) ప‌ట్టుబ‌డుతోంది. జ‌న‌సేన పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ వ‌ర్గం.. రిజ‌ర్వేష‌న్తో సంబంధం లేకుండా త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుతోంది. అనంత‌పురంలో బ‌లిజ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఈ వ‌ర్గం అంటోంది. దీంతో మేయ‌ర్ పీఠంపై ఆశ‌లు పెట్టుకుంది. ఇక‌, మ‌రోవైపు టీడీపీ ఆర్య‌వైశ్య నాయ‌కులు తాజాగా మీటింగులు పెట్టుకుని.. త‌మ డిమాండ్ల‌పై ఏకాభిప్రాయం సాధించారు. త్వ‌ర‌లోనే పార్టీ అధినేత‌ను క‌లిసి.. త‌మ డిమాండ్‌ను వినిపించ‌నున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.