Begin typing your search above and press return to search.

'అనంత' మార్పులు.. 2 నుంచి 4 నియోజ‌క‌వ‌ర్గాలు.. !

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కీలక చర్చ నియోజకవర్గాల పునర్విభజన. ఎవరిని కదిపినా.. ఏ నలుగురు గుమిగూడినా ఈ విషయంపైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది.

By:  Garuda Media   |   1 April 2026 11:00 AM IST
అనంత మార్పులు.. 2 నుంచి 4 నియోజ‌క‌వ‌ర్గాలు.. !
X

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కీలక చర్చ నియోజకవర్గాల పునర్విభజన. ఎవరిని కదిపినా.. ఏ నలుగురు గుమిగూడినా ఈ విషయంపైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఉన్న అతిపెద్ద జిల్లా కూడా అనంతపురం. నాయకులతోపాటు పార్టీల దూకుడు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. విభిన్నమైన పరిస్థితులు సమస్యలు ఉన్న జిల్లాగా కూడా అనంతపురం నిలిచింది. అనంతపురం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక వలసలు పెరుగుతున్నాయి.

అదేవిధంగా జిల్లాస్థాయిలోకి వచ్చేసరికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటివి కూడా కీలకంగా మారుతున్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం ఒక ఎత్తు.. అయితే మరోవైపు జిల్లాలో జనాభా ప్రాతిపదికన గతంలో 14 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 16 నుంచి 18 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో దీనిని బట్టి అనంతపురం జిల్లాలో మరో నాలుగు నియోజకవర్గాలు పెరుగుతాయి. ప్రధానంగా హిందూపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో మార్పులు కచ్చితంగా ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న సత్యసాయి ఆశ్రమం నుంచి గ్రామీణ ప్రాంతాలను విడదీసి ఒక నియోజకవర్గం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా హిందూపురం- కళ్యాణదుర్గంలోనూ ఈ తరహా మార్పులే ఉంటాయని అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా రెండు నుంచి నాలుగు నియోజకవర్గాలు కచ్చితంగా ఏర్పడనున్నాయి. జిల్లా మొత్తంగా ఉన్న జనాభాను అంచనా లోకి తీసుకుంటే నాలుగు నియోజకవర్గాలు కచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎక్కువగా వలసలు ఉన్న జిల్లా కావడంతో ఈ సంఖ్య రెండు కి కానీ మూడుకి కానీ పరిమితం అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

భారీ ఎత్తున జ‌నాభా సంఖ్య‌ ఉన్న నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో మార్పులు జరగకపోవచ్చు అని అంటున్నారు. ఇక ఎస్సీ పరంగా చూసుకుంటే ఒక నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక ఎస్టీ నియోజకవర్గం కూడా అనంతపురంలో ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రాయదుర్గం అదేవిధంగా కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో ఒక ఎస్టీ నియోజకవర్గ ఏర్పడినా ఏర్పడవచ్చు అని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు ఉన్న అంచనా ప్రకారం రెండు నుంచి నాలుగు నియోజకవర్గాలు పెరుగుతాయని భావిస్తున్నారు. దీనిని బట్టి జిల్లా స్వరూపం మారే అవకాశం కూడా కనిపిస్తోంది.