రిలయన్స్ పగ్గాలు అనంత్ అంబానీ చేతికి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డులో అత్యంత కీలకమైన బాధ్యతల్లో అనంత్ అంబానీ నియామకానికి షేర్‌హోల్డర్ల నుండి భారీ మద్దతు లభించింది.
By: Sivaji Kontham | 9 Jun 2026 1:50 AM ISTరిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డులో అత్యంత కీలకమైన బాధ్యతల్లో అనంత్ అంబానీ నియామకానికి షేర్‌హోల్డర్ల నుండి భారీ మద్దతు లభించింది. రిలయన్స్ హోల్-టైమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ నియామక ప్రతిపాదనకు ఏకంగా 94.4 శాతం మంది వాటాదారులు అనుకూలంగా ఓటు వేసినట్లు కంపెనీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ 1 మే 2025 నుండి ఐదేళ్ల కాలపరిమితికి గానూ ఈ పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు.
ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ అయిన అనంత్ అంబానీ వ్యాపార రంగంతో పాటు జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాలలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రమాదంలో ఉన్న అనారోగ్యంతో ఉన్న మూగజీవాల పునరావాసం కోసం... వాటి శేషజీవితానికి అవసరమైన గౌరవప్రదమైన సంరక్షణను అందించడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ పరిధిలో 3000 ఎకరాల విస్తీర్ణంలో ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `వంతారా` వైల్డ్‌లైఫ్ ప్రిజర్వేషన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అనంత్ అంబానీ విశేష సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ సొసైటీ నుండి `గ్లోబల్ హ్యూమనిటేరియన్ అవార్డ్ 2025` అందుకున్న అత్యంత పిన్న వయస్కుడైన- మొదటి ఆసియా వ్యక్తిగా అనంత్ అంబానీ చరిత్ర సృష్టించారు.
రిలయన్స్ సామ్రాజ్యంలో అనంత్ అంబానీ ప్రయాణం క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ప్రస్తుత హోల్-టైమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలకు ముందు ఆయన జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ , రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ వంటి గ్రూప్ కంపెనీల బోర్డులలో సభ్యుడిగా వ్యవహరించారు. అలాగే సెప్టెంబర్ 2022 నుండి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు మెంబర్‌గా కూడా సేవలందిస్తున్నారు. కాగా అనంత్ సోదరుడు ఆకాష్ అంబానీ ప్రస్తుతం టెలికాం రంగమైన రిలయన్స్ జియో ఇన్‌ఫోకామ్‌కు చైర్మన్‌గా, సోదరి ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ.. ఆర్‌ఐఎల్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యంత పిన్న వయస్కుడైన హోల్-టైమ్ డైరెక్టర్‌గా అనంత్ అంబానీ బాధ్యతలు చేపట్టడంపై గతంలో ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడిచింది. అతడి వయస్సు, లీడర్‌షిప్ అనుభవంపై అంతర్జాతీయ ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ `ఇన్‌స్టిట్యూషనల్ షేర్‌హోల్డర్ సర్వీసెస్ ఇంక్` (ISS) గతంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాదాపు ఆరేళ్ల పరిమిత బోర్డు అనుభవం ఉన్న అనంత్ నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని 2023లో ఐఎస్ఎస్ షేర్‌హోల్డర్లకు సిఫార్సు చేసింది. అయితే ఆకాష్, ఇషా అంబానీల నియామకాలను మాత్రం సమర్థించింది.
మరోవైపు అంతర్జాతీయ ప్రాక్సీ సంస్థ `గ్లాస్ లూయిస్` మాత్రం అనంత్ అంబానీ నియామకానికి పూర్తి మద్దతు పలికింది. అనుభవం విషయంలో అనంత్‌ను మిగిలిన తోటి సోదర సోదరీమణులతో వేరు చేసి చూడలేమని గ్లాస్ లూయిస్ ఆసియా-పసిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్ డెక్కీ విండార్టో స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు అనంత్ కంటే కేవలం మూడేళ్లు మాత్రమే పెద్దవారని... అందరికీ సమానమైన ప్రొఫెషనల్ అనుభవం ఉందని పేర్కొంటూ అనంత్ నియామకాన్ని సమర్థించారు. తాజాగా జరిగిన ఓటింగ్‌లో షేర్‌హోల్డర్లు 94.4 శాతం భారీ మెజారిటీతో అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అనంత్ అంబానీ నాయకత్వంపై రిలయన్స్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టమైంది.
