న్యూజెర్సీలో భారత సంతతి నేతకు షాక్.. రూ.4.79 మిలియన్ గ్యాంబ్లింగ్ కేసులో కీలక పరిణామం
అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడం, జూద కార్యకలాపాలకు సహకరించడం మాత్రమే కాకుండా.. తాను నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధి పదవిని కూడా దుర్వినియోగం చేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
By: A.N.Kumar | 30 Aug 2026 8:32 PM ISTఅమెరికాలోని న్యూజెర్సీ రాజకీయంలో తీవ్ర సంచలనం నమోదైంది. 4.79 మిలియన్ డాలర్ల విలువైన అక్రమ జూద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రాస్పెక్ట్ పార్క్ బరో కౌన్సిల్‌మెన్ ఆనంద్ షా (44) కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. దీంతో ఆయన తన కౌన్సిల్‌మెన్ పదవికి తక్షణమే రాజీనామా చేశారు.
అక్రమ జూద కార్యకలాపాల్లో కీలక పాత్ర
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. 2017 నుంచి 2023 మధ్య న్యూజెర్సీలోని పలు కౌంటీల పరిధిలో రెస్టారెంట్లను కేంద్రంగా చేసుకుని అక్రమ పోకర్ గేమ్స్, స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించిన నెట్‌వర్క్‌లో ఆనంద్ షా పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా ఆయన సుమారు 9 లక్షల డాలర్లు సంపాదించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడం, జూద కార్యకలాపాలకు సహకరించడం మాత్రమే కాకుండా.. తాను నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధి పదవిని కూడా దుర్వినియోగం చేసినట్లు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో నేరాన్ని అంగీకరించిన అనంతరం న్యూజెర్సీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ పదవినీ చేపట్టకుండా ఆయనపై శాశ్వత నిషేధం విధించనున్నారు.
రాజకీయాలకు అక్రమ డబ్బు మళ్లించారా?
ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఆనంద్ షా రాజకీయ కార్యకలాపాలతో ముడిపడి ఉంది. అక్రమ జూదం ద్వారా వచ్చిన డబ్బును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. జూదంలో అప్పులు చేసిన కొందరికి ఆ అప్పులను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసి, అందుకు బదులుగా తన రాజకీయ ప్రచారానికి విరాళాలు ఇవ్వాలని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంటే.. సాధారణ రాజకీయ విరాళాల రూపంలో కనిపించిన కొన్ని చెల్లింపుల వెనుక అక్రమ జూద కార్యకలాపాల డబ్బు ఉండే అవకాశం ఉందని దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసు కేవలం గ్యాంబ్లింగ్‌కు పరిమితం కాకుండా రాజకీయ అవినీతి, అధికార దుర్వినియోగం కోణాన్నీ సంతరించుకుంది.
పదవికి రాజీనామా
ఆనంద్ షాపై 2025లోనే కేసు నమోదై అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన కొంతకాలం కౌన్సిల్ పదవిలో కొనసాగారు. స్థానిక అధికారులు అప్పట్లోనే పదవికి రాజీనామా చేయాలని కోరినట్లు సమాచారం. అయితే ఆయన వెంటనే తప్పుకోలేదు. తాజాగా కోర్టులో నేరాన్ని అంగీకరించిన విషయం బహిర్గతం కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.
$4.79 మిలియన్ అక్రమ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్
ఆనంద్ షా కేసు వెనుక ఉన్న దర్యాప్తు మరింత విస్తృతంగా సాగుతోంది.. లూచీస్ క్రైమ్ ఫ్యామిలీతో సంబంధం ఉన్నట్లు చెబుతున్న అక్రమ జూద నెట్‌వర్క్‌పై అధికారులు భారీ స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం 42 మందిపై అభియోగాలు నమోదైనట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
దర్యాప్తు సంస్థల అంచనా ప్రకారం ఈ నెట్‌వర్క్ అక్రమ జూద కార్యకలాపాల ద్వారా సుమారు 4.79 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇందులో భాగమైన పలువురు ఇప్పటికే తమ నేరాలను అంగీకరించారు. రెస్టారెంట్లు సహా వివిధ ప్రదేశాలను ఉపయోగించుకుని పోకర్ గేమ్స్, స్పోర్ట్స్ బెట్టింగ్ నిర్వహించడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పదేళ్ల వరకు జైలు శిక్ష?
నేరాన్ని అంగీకరించిన ఆనంద్ షాకు గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయనకు శిక్షను డిసెంబర్ 4న ఖరారు చేయనున్నట్లు సమాచారం. తుది శిక్షను కోర్టు నిర్ణయించనుంది.
న్యూజెర్సీలో జూదానికి చట్టబద్ధమైన మార్గాలు ఉన్నప్పటికీ, అనుమతి లేని పోకర్ గేమ్స్, స్పోర్ట్స్ బెట్టింగ్ వంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధమే. ఈ కేసు ద్వారా చట్టబద్ధమైన గ్యాంబ్లింగ్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో కూడా వ్యవస్థీకృత నేర ముఠాలు అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్న తీరుపై మరోసారి చర్చ మొదలైంది.
ఆనంద్ షా విషయంలో మాత్రం ఈ వ్యవహారం ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లైంది. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అక్రమ జూద నెట్‌వర్క్‌లో భాగస్వామిగా ఉండటం, ఆ డబ్బును రాజకీయ కార్యకలాపాలతో అనుసంధానించినట్లు ఆరోపణలు రావడం అమెరికాలోనే కాకుండా భారతీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

