అమెరికా పెంపుడు జంతువు పాక్.. హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు పెంపుడు జంతువులతో, భారత ప్రధాని మోదీ పుంగనూరు ఆవుతో ఉన్న ఫొటోలను (ఒకే ఫ్రేమ్) పోస్ట్ చేశారు.
By: Tupaki Political Desk | 9 Oct 2025 4:44 PM ISTపారిశ్రామిక దిగ్గజాలైనప్పటికీ ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు. దేశంలోని ఏ ఇతర ప్రముఖ పారిశ్రామికవేత్తలకూ లేనంత సామాజిక చైతన్యం, సమకాలీన అంశాల పట్ల అవగాహన వీరి సొంతం. తమదైన విశ్లేషణతో వీరు పెట్టే పోస్ట్ లకు సోషల్ మీడియాలో ఆదరణ కూడా అధికమే. వీరు ఏ పోస్ట్ పెట్టినా అది దేశం అంతా చర్చనీయం అవుతుంది కూడా..!
ఆయనది సామాజిక చైతన్యం.. ఈయనది సమకాలీనం
మహీంద్రా సంస్థల అధిపతి అయిన ఆనంద్ మహీంద్రాకు సామాజిక చైతన్యం ఎక్కువ. సొసైటీలో ఏ స్ఫూర్తిదాయక అంశం ఉన్నా పోస్ట్ చేస్తుంటారు. ఇక ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అయిన హర్ష్ గోయెంకాది సమకాలీన అంశాల పట్ల స్పందించే తత్వం. ఉదాహరణకు ఆ మధ్య వరుసగా ఫ్రాన్స్, నేపాల్, జపాన్, థాయ్ లాండ్ ప్రధానులు చంద్రగ్రహణం సమయంలో పదవులు కోల్పోయారు. దీంతో వచ్చేది సూర్య గ్రహణం.. ఇంకెందరు నాయకులు పదవులు కోల్పోతారో? అంటూ ట్వీట్ పెట్టారు. తాజాగా హర్ష్ గోయెంకా పెట్టిన మరో ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.
దేశాధినేతల పెట్ లతో..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు పెంపుడు జంతువులతో, భారత ప్రధాని మోదీ పుంగనూరు ఆవుతో ఉన్న ఫొటోలను (ఒకే ఫ్రేమ్) పోస్ట్ చేశారు. ఇందులో మరో ఫ్రేమ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఆసిం మునీర్ ఉన్నారు. దీనికి ప్రపంచ నాయకులు అందరూ వారివారి ఫేవరెట్ పెట్స్ తో ఉన్నారు.. అంటూ క్యాప్షన్ జోడించారు. అమెరికాకు పెంపుడు జంతువు పాకిస్థాన్ అనే అర్థంలో ఈ ట్వీట్ పెట్టారు.
అమెరికాకు బుద్ధి రాదు..
ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ పాకిస్థాన్ ఎంతటి దారుణాలకు ఒడిగట్టినా అమెరికాకు మాత్రం బుద్ధి రావడం లేదు. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఇటీవల షాబాజ్ షరీఫ్, ఆసిం మునీర్ లతో భేటీ కావడమే కాదు.. పాకిస్థాన్ ను పొగిడారు కూడా. ఇక ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే ఆ దేశానికి ఆయుధాలను అమ్ముతున్నారు.
