ఆనం యూటర్న్... వచ్చే ఎన్నికల్లోనూ పోటీ.. ?
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌లోనే ఉన్నారు.
By: Garuda Media | 10 Sept 2026 5:00 PM ISTనెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌లోనే ఉన్నారు. ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే.. ఆయన రిటైర్ అవుతున్నారని.. ఆయన వారసుడు ఎవరు ? అంటూ.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ, కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆనం విషయం తరచుగా తెరమీదికి వస్తోంది.
ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నారని చెబుతున్నారు. కానీ, ఆనం ఎక్కడా అసలు ఈ విషయం చెప్పలేదని అంటున్నారు. రిటైర్మెంట్ గురించిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని అంటున్నారు. మంత్రిగా ఆయన ప్రస్తుతం ఆత్మకూరు పట్టణ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి పనుల్లో (రోడ్ల విస్తరణ, క్రీడా ప్రాంగణాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటివి) పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆనం యూటర్న్ తీసుకున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నచర్చ.
ప్రస్తుతం 70+కు చేరి ఆనం.. మరో మూడేళ్ల తర్వాత.. పోటీకి రెడీ కాలేరన్న వాదన సహజం. అయితే.. ఆత్మకూరుతో తనకు ఉన్న బంధం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి రెడీ అవుతానంటూ.. తన అనుచరులకు చెపుతున్నారట. కాబట్టి ప్రస్తుతానికి ఆత్మకూరు బరిలో వేరే వారు వస్తారనే ప్రశ్నే లేదు; ఆయనే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేయనున్నారు.. అని అంటున్నారు.
టీడీపీ ఆలోచన ఏంటి..?
టీడీపీ ఆలోచన మరో విధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆనం.. టీడీపీ తరఫున ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నిర్ణ యించింది. ప్రధానంగా.. నారా లోకేష్ నాయకత్వాన్ని పెంచే దిశగా సమాలోచనలు చేస్తున్న దరిమిలా.. వృద్ధ నేతలను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనంను నామినేటెడ్‌పదవికి షిఫ్టు చేసి.. ఆత్మకూరును వేరే వారికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ. కానీ, ఆనం మాత్రం.. ఈ విషయాలు వెలుగు చూస్తున్న క్రమంలో మరింత యాక్టివ్ అవుతుండడం గమనార్హం.
