ఆనం రిటైర్మెంట్.. వారసుడు ఎవరు.. ?
ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు ఎమ్మెల్యేగా.. ప్రస్తుత దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు.
By: Garuda Media | 18 Jan 2026 1:00 AM ISTఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు ఎమ్మెల్యేగా.. ప్రస్తుత దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. గతం లోనూ ఆయన అనేక పదవులు అలంకరించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. ఆయన వచ్చే ఎన్నికల నాటికి రిటైర్మెంట్ ప్రతిపాదన చేశారు. ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో తన రిటైర్మెంట్‌పై వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. అయితే.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నా నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం ఆయన ఆలోచన చేస్తున్నారు. ఒక్కసారైన రాజ్యసభకు వెళ్లాలన్నది ఆయన ఆలోచన. ఇదిలావుంటే.. ఒకవేళ ఆయన చెబుతున్నట్టుగానే రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్న. ప్రధానంగా ఆనం వివేకానందరెడ్డి కుమారుడు.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ, ఆయన మనసు టీడీపీపై కాకుండా.. వైసీపీపై ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో వివేకా కుమా రుడిని కాకుండా.. ఆనం అల్లుడిని వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారానికి అల్లుడు కీలకంగా వ్యవహరించారని.. ఆయన అన్నీ తానై చూసుకున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అల్లుడికి అవకాశం కల్పించే దిశగా ఆనం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో వివేకానంద రెడ్డి కుమారుడు ముందస్తు వ్యూహాలు వేస్తున్నట్టు మరో చర్చ సాగుతోంది. సొంత పెదనాన్న కావడం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. అయితే.. ఆనం రామనారాయణ రెడ్డి అధికారికంగా ఇంకా తన రిటైర్మెంట్‌పై ప్రకటన చేయలేదు. కానీ, అనుచరులతో మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూడాలి. కాగా.. ఆనం వర్గానికి ఆత్మకూరులో బలమైన ఓటు బ్యాంకు ఉండడం గమనార్హం.
