Begin typing your search above and press return to search.

ఏపీలో దూసుకుపోతున్న ఒకే ఒక జిల్లా !

ఎవరికి ఎపుడు దశ తిరుగుతుందో అని అంటూంటారు. ఆ జిల్లాను చూస్తే అదే చెప్పాలనిపిస్తుంది.

By:  Satya P   |   23 Nov 2025 9:00 AM IST
ఏపీలో  దూసుకుపోతున్న ఒకే ఒక  జిల్లా !
X

ఎవరికి ఎపుడు దశ తిరుగుతుందో అని అంటూంటారు. ఆ జిల్లాను చూస్తే అదే చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఇపుడు ఆ జిల్లా జాతకమే మారిపోయింది. ఒకనాడు ఏమీ కాకుండా ఉన్న ప్రాంతం సైతం ఇపుడు అదృష్ట రేఖను టచ్ చేస్తోంది. దాంతో అన్ని విధాలుగా దూసుకుపోతోంది. ఇంతకీ ఏపీలో ఆ జిల్లా పేరు ఏమిటి అనే కదా అందరి ఆసక్తి. ఆ జిల్లావే అనకాపల్లి. అనకాపల్లి అనగానే కేవలం బెల్లం మార్కెట్. దాని చుట్టూ ఒకటి రెండు చక్కెర కర్మాగారాలు అని మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్ గా అనకాపల్లికి ఖ్యాతి ఎపుడూ టాప్ లోనే ఉంటుంది.

జోరు అటు వైపు :

ఇక ఇపుడు అనకాపల్లి దశ తిరిగింది. ఎలా అంటే వరసగా అనేక పరిశ్రమలు అనకాపల్లి జిల్లాలోనే ఏర్పాటు అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి కోసం తలుపులు తెరచింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీలో పరిశ్రమలను పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏపీలో ఎక్కువగా అనకాపల్లికి లాభం కలిగించేలా ఉన్నాయి. దానికి కారణాలు ఉన్నాయి అవే మౌలిక సదుపాయాలు అని చెబుతున్నారు.

విశాఖ పక్కనే :

విశాఖ పక్కనే అనకాపల్లి ఉండడం ఒక అదృష్టం. దాని వల్ల విశాఖ మౌలిక సదుపాయాలు అన్నీ అనకాపల్లికి అచ్చంగా కలసివస్తున్నాయి. అదే సమయంలో విశాఖ ఇప్పటికే పారిశ్రామిక నగరంగా పీక్స్ కి చేరింది అక్కడ ఎప్పటి నుంచో ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక కొత్తగా పరిశ్రమలు రావాల్సి ఉన్నా భూముల కొరత అయితే ఉంది. దాంతో ఆల్టర్నేషన్ గా అనకాపల్లి మారుతోంది. ఈ అవకాశాన్ని అనకాపల్లి చక్కగా వాడుకుంటోంది. విశాఖలో ఉన్న ఎయిర్ పోర్టు సీ పోర్టు అలాగే రోడ్డు రైల్ కనెక్టివిటీ మెగా సిటీగా ఉన్న గుర్తింపు అనకాపల్లికి కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడుతున్నాయని చెప్పాల్సి ఉంది.

మరో స్టీల్ ప్లాంట్ :

విశాఖకు ఉక్కు నగరం అన్న పేరు స్టీల్ ప్లాంట్ ద్వారానే వచ్చింది. అయితే ఇపుడు అనకాపల్లి కూడా రెండవ ఉక్కు నగరంగా మారబోతోంది. అక్కడ మిట్టల్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. అది కూడా భారీ ఎత్తున. ఇది నిజంగా అనకాపల్లి దశను మార్చేసే భారీ పరిశ్రమగా చెప్పాలి. అంతే కాదు. రిలయన్స్ సంస్థ కూడా అనకాపల్లి వైపు చూస్తోంది. ఈ జిల్లాలోని రాంబిల్లి వద్ద ఫుడ్ ప్రొసెసిగ్ రంగంలో ఏకంగా 784 కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కంపెనీకి ప్రభుత్వం కూడా ముప్పయి ఎకరాల భూమిని కేటాయించింది. మరో వైపు బీక్యూ అనే సంస్థ టెక్స్ టైల్స్ పరిశ్రమ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది అని అంటున్నారు. అలాగే ఇదే జిల్లాలో నర్శీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో ఎర్త్ మూవర్స్ సంస్థ ఏకంగా 1300 కోట్ల రూపాయలతో వంద ఎకరాల సువిశాల స్థలంలో యంత్రాలు విడి భాగాల తయారీ ప్లాంట్ నే ఏర్పాటు చేయనుంది అని భోగట్టా.

వరుసగా వచ్చేస్తున్నాయి :

ఇవే కాదు అనకాపల్లిలో మెడి టెక్ గ్రీన్ హైడ్రో జోన్ సిటీ, క్లీన్ టెక్ మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ వంటివి కూడా ఏర్పాటు కాబోతున్నాయని అంటున్నారు. అనకాపల్లి ఫ్యూచర్ ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతోంది. దానికి ప్రధాన కారణం భూములు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండడమే. అంతే కాదు విశాఖ వైపు చూస్తున్న పారిశ్రామికవేత్తలకు పక్కనే అనకాపల్లి జిల్లా అందుబాటులో ఉండడం అని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే విశాఖతో పాటుగా అనకాపల్లి జంట నగరంగా అభివృద్ధి చెందే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. అనకాపల్లిలో భూములు ఇప్పటి నుంచే రెక్కలు విప్పుకుంటున్నాయంటే భవిష్యత్తులో ఈ జిల్లా ఏ విధంగా మారుతుందో అర్థం చేసుకోవాల్సిందే అని అంటున్నారు.