మంత్రి మండిపల్లికి బిగ్ రిలీఫ్.. రాయచోటిపై ఫేవర్ చేసిన సర్కార్
అన్నమయ్య జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 28 Jan 2026 9:00 PM ISTఅన్నమయ్య జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. జిల్లా కేంద్రం మార్పుతో డీలా పడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కాస్త ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ప్రధానంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో తలెత్తుకుని తిరిగేలా చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 1వ తేదీ నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చారు. ఈ పరిణామం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంకటంగా మారిందని ప్రచారం జరిగింది. మదనపల్లెను కొత్త జిల్లాగా చేస్తామని తొలుత చెప్పిన ప్రభుత్వం.. ఏవేవో సమీకరణలతో రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసివేసింది. దీంతో స్థానిక శాసనసభ్యుడైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు మంత్రి పదవిని ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించినట్లు చెబుతున్నారు. అయితే జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసివేయడం వల్ల నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగడం మంత్రికి ఇబ్బందికరంగా మారింది. ఇది నియోజకవర్గ ప్రజల భావోద్వేగానికి సంబంధించిన అంశం కావడంతో మంత్రి రామప్రసాద్ కూడా తీవ్ర ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు.
అయితే మదనపల్లె జిల్లా కేంద్రంగా మార్చిన తర్వాత రాయచోటి వాసులను నెమ్మదిగా ఒప్పించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరో విషయంలో చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నారని అంటున్నారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసివేసినా, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు మాత్రం జిల్లా కేంద్రంగానే వసూలు చేయడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను రెండు రెట్లు పెంచారని అంటున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భూమి విలువను 200 శాతం పెంచారు. ఈ ఫిబ్రవరి 1 నుంచి వీటిని 300 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా భూములు విలువ పెరగడం ఆయా ప్రాంతాల్లో ప్రజలకు భారంగా మారింది. అయితే జిల్లా కేంద్రాల్లో రియల్ వ్యాపారం దృష్ట్యా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని అంటున్నారు. కానీ, రాయచోటి జిల్లా కేంద్రం కాకపోయినా 300 శాతం భూముల విలువ పెరిగి, చార్జీలు పెరగడం ప్రజలకు రియల్ వ్యాపారులకు భారంగా మారిందని అంటున్నారు. రాయచోటిని మార్చినా భూముల రిజిస్ట్రేషన్ విషయంలో జిల్లా కేంద్రంగా చూడటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇక మంత్రి విజ్ఞప్తితో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హుటాహుటిన స్పందించారు. మంత్రి మండిపల్లికి ఇబ్బంది లేకుండా రాయచోటిని భూముల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నుంచి మినహాయించారు. దీంతో ప్రజలపై భారం తగ్గిపోయిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేందుకు కారణమైందని అంటున్నారు. జిల్లా కేంద్రం పోవడం ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిన్నబుచ్చుకున్నా, తాజా నిర్ణయంతో ఆయన నియోజకవర్గంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితిని తీసుకువచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు.
