Begin typing your search above and press return to search.

ఆమ్రపాలికి మళ్లీ అక్కడే పోస్టింగ్..

సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మళ్లీ పర్యాటక శాఖలోనే ప్రభుత్వం నియమించింది.

By:  Tupaki Political Desk   |   12 Oct 2026 12:44 PM IST
ఆమ్రపాలికి మళ్లీ అక్కడే పోస్టింగ్..
X

సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మళ్లీ పర్యాటక శాఖలోనే ప్రభుత్వం నియమించింది. గత ఆగస్టులో జరిగిన బదిలీల్లో ఆమ్రపాలిని ఏపీ టీడీసీ ఎండి బాధ్యతల నుంచి తప్పించారు. కేవలం నెలన్నరకే తిరిగి పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు. దీంతో ఆమ్రపాలి పోస్టింగ్ పై విస్తృత చర్చ జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ హోదాలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలిని అంతగా ప్రాధాన్యం లేని పర్యాటక శాఖకు మాత్రమే పరిమితం చేయడంపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. డీవోపీటీ బదిలీల్లో ఆమె రెండేళ్ల క్రితం ఏపీ క్యాడర్ కు బదిలీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆమ్రపాలికి పర్యాటక శాఖ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలి వంటి సమర్థ అధికారిణికి అలాంటి పోస్టు ఇవ్వడంపై అప్పట్లోనే పెద్ద చర్చ జరిగింది. అయితే ఆమ్రపాలి తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఆమెను వెనక్కి తీసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో తాత్కాలికంగా పర్యాటకశాఖలో పోస్టు కేటాయించారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఇక పర్యాటక శాఖ ఎండీగా బాధ్యతలు తీసుకున్న కొద్దికాలానికే ఆమ్రపాలి సెలవు తీసుకున్నారు. తెలంగాణకు బదిలీపై వెళ్లేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సెలవు ముగిసినా ఆమె తిరిగి విధుల్లో చేరకపోవడంతో గత ఆగస్టులో ఆమ్రపాలిని సాధారణ పరిపాలనశాఖకు బదిలీ చేశారు. అయితే పక్కరాష్ట్రానికి బదిలీపై వెళ్లాలని ఆమ్రపాలి చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో ఆమె మళ్లీ విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమ్రపాలిని మళ్లీ పర్యాటక శాఖలోనే పోస్టింగు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

తెలంగాణలో పనిచేసిన సమయంలో కలెక్టర్ గా, జీహెచ్ఎంసీ కమిషనర్ గా, ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా కీలక బాధ్యతలలో పనిచేసిన ఆమ్రపాలి ఏపీలో మాత్రం అప్రాధాన్య శాఖకే పరిమితం కావడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిన్నవయసులోనే అత్యంత సవాళ్లతో కూడిన ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చిన ఆమ్రపాలి ఏపీలో సరైన పోస్టింగు దక్కించుకోలేకపోవడానికి కారణమేంటో కూడా అర్థం కావడం లేదని అంటున్నారు. నిజానికి రాష్ట్రంలో సమర్థులైన అధికారులను జల్లెడ పడుతూ కీలక పోస్టింగులు ఇస్తున్న ప్రభుత్వం ఆమ్రపాలిని సీరియస్ గా తీసుకోకపోవడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. అయితే ఆమ్రపాలి బదిలీ ప్రయత్నాలకు ఇబ్బంది లేకుండా, ఆమెను ఏ క్షణంలో అయినా రివీల్ చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం అప్రాధాన్య పోస్టులను కేటాయిస్తోందని చెబుతున్నారు.