Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నిమజ్జనానికి షా.. తొలిసారి కేంద్రమంత్రి!

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హైదరాబాద్ వస్తున్నారు. తాజాగా అధికారికంగా కన్ఫర్మేషన్ ఇచ్చారు.

By:  Garuda Media   |   4 Sept 2025 9:41 AM IST
హైదరాబాద్ నిమజ్జనానికి షా.. తొలిసారి కేంద్రమంత్రి!
X

దేశంలో గణేశ్ నిమజ్జనానికి మహారాష్ట్ర రాజధాని ముంబయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ తర్వాత ఇస్పెషల్ అంతా హైదరాబాద్ మహానగరంలోనే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జన వేళ.. హైదరాబాద్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచ్చేయనున్న వైనం ఆసక్తికరంగా మారింది. నిమజ్జనానికి అమిత్ షా రానున్నట్లుగా వార్తలు వచ్చినప్పటికి పక్కా షెడ్యూల్ మాత్రం వెలువడలేదు. తాజాగా ఆయన షెడ్యూల్ బయటకు వచ్చింది.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యే ఆయన.. అక్కడకు వచ్చే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెబుతున్నారు. నిజానికి హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కావటం మామూలే. అయితే.. ఈ ఏడాది కేంద్ర హోంమంత్రే ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ విషయంలో ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. హైదరాబాద్ వస్తున్నారు. తాజాగా అధికారికంగా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నెల ఆరున (శనివారం) ఆయన హైదరాబాద్ రానున్నారు. శనివారం మధ్యాహ్నా వేళకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటల వేళలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకునే అమిత్ షా.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో రాష్ట్ర బీజేపీ నేతలతో షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అదే సమయంలో ఐటీసీ కాకతీయ హోటల్ నుంచే ఎస్ఎస్ బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ను వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 4.10 గంటల నుంచి 4.55 గంటల మధ్య కాలంలో మొజంజాహీ మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారని చెబుతున్నారు. అనంతరం 5.05 గంటల వేళలో బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.

ఇప్పటివరకు జరిగిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖుల విషయానికి వస్తే.. ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి.. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. కేంద్ర మాజీ మంత్రులు ఉమాభారతి.. సాధ్వి రీతంబర.. సంఘ్ పరివార్ ప్రస్తుత సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్.. పూర్వ సర్ సంఘ్ చాలక్ లు బాలసాహెబ్ దేవరస్.. ప్రొ. రాజేందర్ సింగ్.. కేఎస్ సుదర్శన్.. వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి ఒకరు ఈ కార్యక్రమానికి హాజరుకావటం మాత్రం ఇదే తొలిసారి.