సుదర్శన్ రెడ్డిపై ఎందుకింత వ్యతిరేక ప్రచారం.. రీజనేంటి?
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరా ష్ట్రపతి అభ్యర్థి.. బి. సుదర్శన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
By: Garuda Media | 26 Aug 2025 10:23 PM ISTకాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరా ష్ట్రపతి అభ్యర్థి.. బి. సుదర్శన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీనిని బీజేపీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఆయనను నక్సల్స్ సానుభూతి పరుడుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పదే పదే చెబుతున్నారు. కేరళ నుంచి తమిళనాడు వరకు ఆయన గత రెండు రోజులుగా ఇదే ప్రచారంతో ఊదర గొట్టారు. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. అమిత్ షా ఎక్కడా వెనక్కితగ్గలేదు. పైగా.. జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూలోనూ అమిత్ షా మరోసారి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
ఎందుకు?
వాస్తవానికి ప్రజలతో నేరుగా సంబంధం ఉండే ఎన్నికల విషయంలో విపక్షాలపై పై చేయి సాధించేందుకు అధికార పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేక ప్రచారం చేయడం సహజం. కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న ఎన్నిక కాదు. కేవలం ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు వేస్తారు. అయితే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ ఎస్ ఎస్ నాయకుడిగా, బీజేపీ ప్రతినిధిగా ఎన్డీయే తరఫున బరిలో ఉన్న సీపీ రాధాకృష్ణన్‌పై కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. తద్వారా.. ఎన్డీయేలోనే ఉన్నప్పటికీ.. ఆర్ ఎస్ ఎస్ ను వ్యతిరేకించే వర్గాలు.. ఎంపీలు.. ఆయనకు ఓటు వేయకుండా చేయాలన్నది కాంగ్రెస్ వ్యూహం.
దీనిని పసిగట్టిన బీజేపీ.. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగిందన్న చర్చసాగుతోంది. వాస్తవానికి ఆయనపై విమర్శలు చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. పైగా.. ఆయనకు రాజకీయాలు అంటగట్టాలన్నా.. సాధ్యం కాదు. ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత.. మౌనంగా ఉంటున్నారు. ఏ పార్టీకి, నేతకు కూడా ఆయన మద్దతు తెలపలే దు. అయినప్పటికీ.. ఆయనను టార్గెట్ చేయడం వెనుక.. తమ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను కాపాడుకునే ఉద్దేశమే ఉందన్న చర్చ ఉంది. అందుకే.. నక్సల్స్ సానుభూతిపరుడుగా.. ఆయనను తీవ్రస్థాయిలో అమిత్ షా విమర్శిస్తున్నారు.
నిజంగానే సానుభూతి పరుడా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి.. మావోయిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నది కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెబుతున్న మాట. కానీ, వాస్తవం ఏంటంటే.. ఆయన మావోయిస్టులను సమర్థించలేదు. వారు చేసిన దురాగతాలను కూడా సమర్థించలేదు. మావోయిస్టుల ఏరివేత కోసం.. అమాయక గిరిజనులతో ఏర్పాటు చేసిన సల్వాజుడుం(శాంతి దళం)ను మాత్రమే వ్యతిరేకించారు. దీనిని మాత్రమే మరో న్యాయమూర్తితో కలిసి ఉన్న ధర్మాసనం నుంచి తీర్పు ఇచ్చారు. నక్సల్స్‌ను ఏరేసేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప.. అమాయక గిరిజనులతో కాదన్నది నాటి తీర్పు. కానీ, దీనిని సుదర్శన్‌రెడ్డికి వేరే రూపంలో ఆపాదించడం వెనుక సీపీ రాధాకృష్ణన్ ఎక్కడ ఓడిపోతారోనన్న బెరుకు స్పష్టంగా బీజేపీలో కనిపిస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
