Begin typing your search above and press return to search.

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

రామ్ లీలా మైదానంలో తన మిత్రులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారీ మార్చ్ అలాగే బహిరంగ సభకు ధీటైన బదులిచ్చింది బీజేపీ.

By:  Satya P   |   2 Nov 2026 11:54 PM IST
రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్  !
X

రామ్ లీలా మైదానంలో తన మిత్రులను పక్కన పెట్టుకుని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారీ మార్చ్ అలాగే బహిరంగ సభకు ధీటైన బదులిచ్చింది బీజేపీ. హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్‌ఫౌండ్రీ నుంచి ఎంజే మార్కెట్‌ వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన రాహుల్ గాంధీకి సూటిగానే ప్రశ్నలు సంధించారు. సర్ ప్రక్రియ మీద తీవ్ర విమర్శలు చేయడం ఓటు చోరీ జరిగింది అంటూ రాహుల్ పదే పదే ఆరోపించడం వంటి వాటి మీద తెలంగాణా సభలో లాజిక్ తో కూడిన జవాబునే అమిత్ షా ఇచ్చేశారు. రాహుల్ అర్ధమవుతోందా అంటూ గెలుపు లెక్క ఇదీ అన్నట్లుగా హాట్ కామెంట్స్ చేశారు.

అసలు మీరెలా గెలిచారు :

ఈవీఎంల వల్లనే తాము ఓడిపోతున్నామని రాహుల్ గాంధీ అనడం పట్ల అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కనుక నిజం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది అని ప్రశ్నించారు. అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడులో విజయాలు ఎలా దక్కాయని నిలదీశారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ దే కదా గెలుపు అని గుర్తు చేశారు. తాము గెలిస్తే అంతా బాగున్నట్లు ఓడితే మాత్రం ఈవీఎంల మీదకు నెట్టడం కాంగ్రెస్ కే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఈ రోజున సర్ ప్రక్రియ బాగా లేదు అని విమర్శిస్తున్న విపక్షాలు సర్ ప్రక్రియ తో పాటు ఓట్ల చోరీ అని కామెంట్స్ చేస్తున్న ప్రతిపక్షాలు 2014, 2019లలో వరసగా మోడీ గెలుపుని ఎందుకు ప్రమాణంగా తీసుకోవని అమిత్ షా ప్రశ్నించారు. అప్పట్లో సర్ ప్రక్రియ కూడా లేదు కదా అని అమిత్ షా లాజిక్ పాయింట్ నే తీశారు.

బోగస్ ఓట్లతోనే :

ఓట్ల చోరీ అన్నది కానే కాదు, ఇండియా కూటమి విమర్శలకు అర్ధం లేదని అమిత్ షా కొట్టి పారేశారు. సర్ ప్రక్రియ ఉద్దేశ్యం దేశంలో భోగస్ ఓట్లు దొంగ ఓట్లు తొలగించడం అని అన్నారు. అలా మూడు కోట్లకు పైగా భోగస్ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించామనే రాహుల్ గాంధీకి కడుపు మంట అని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భోగస్ ఓట్లను అడ్డం పెట్టుకునే కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందని తీవ్ర ఆరోపణలనే చేశారు. ఈ రోజున సర్ ప్రక్రియతో వాటిని తీసేయడాన్ని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోంది అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే సర్ ప్రక్రియను తప్పు పడుతున్నారని ఓట్ల చోరీ అంటూ నానా యాగీ చేస్తున్నారు అని అమిత్ షా ఫైర్ అయ్యారు.

ఆర్ ఆర్ టాక్స్ అంటే :

ఆర్ ఆర్ టాక్స్ తెలంగాణాలో అమలు అవుతోందని అమిత్ షా ఆరోపించారు. ఆర్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కి కట్టే టాక్స్ అని అన్నారు. తెలంగాణా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం మాదిరిగా మారింది అని అమిత్ షా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మేలైన పాలన సాగకపోగా హామీలను సైతం పక్కన పెట్టేశారు అని అమిత్ షా అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు ఏమయ్యాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వాటిని గాలికి వదిలేశారు అని ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ మీద పదునైన వ్యాఖ్యలే చేశారు.

బీజేపీ వచ్చేది ఖాయం :

ఇక వచ్చేది తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మోడీ నాయకత్వంలో 12 ఏళ్ళుగా అవినీతి రహితమైన పాలన సాగింది అని ఆయన గుర్తు చేశారు. అలాగే అనేక రాష్ట్రాలలో బీజేపీ పాలన సాగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ని ఓడించి గద్దెనెక్కేది కచ్చితంగా బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. తాము గెలిచేది ప్రజల ఓట్లతో వారి అభిమానంతో అంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా కాంగ్రెస్ గెలుపు మాత్రం భోగస్ ఓట్లతోనే అని తేల్చేశారు. మరి దీనికి కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి రిటార్ట్ ఎలా వస్తుందో చూడాల్సి ఉంది.