రాహుల్ కి ఘోర పరాజయమే...సర్వే కాదు జోస్యం !
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ప్రధాని అవుతారని కాంగ్రెస్ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
By: Satya P | 13 Oct 2026 11:00 PM ISTరాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ప్రధాని అవుతారని కాంగ్రెస్ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఇటీవల కాలంలో బీజేపీ మీద ఆయన రాజకీయ దూకుడు పెరిగింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం మీద సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద రాహుల్ గాంధీ విమర్శల జోరు పెంచి దాడిని తీవ్ర తరం చేశారు. దాంతో పాటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలోని దాదాపుగా 200 మంది అధికారులు తనతో టచ్ లో ఉన్నారని ఒక పెద్ద బాంబు పేల్చారు. మోడీ ప్రభుత్వం గద్దె దిగక తప్పదని కాంగ్రెస్ అగ్ర నేత సాగిస్తున్న ఈ పోరాటం జనాలకు ఎంత వరకూ చేరిందో తెలియదు కానీ బీజేపీకి ఆ వేడి బాగానే తగులుతోంది. దాంతో బీజేపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రాహుల్ గాంధీకి వచ్చింది.
ఓటమే బహుమానం :
రాహుల్ గాంధీ సాగిస్తున్న ఈ దూకుడు రాజకీయానికి ఓటమే మరోసారి బహుమానంగా లభించబోతోంది అని బీజేపీ అంటోంది. ఆయన ఆశిస్తున్నట్లుగా విజయం అందుకోలేరని కూడా స్పష్టం చేస్తోంది. కేంద్ర హోం మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఏఎన్ఐ, పీటీఐ తదితర న్యూస్ ఏజెన్సీలతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ ముసుగులో అక్రమ చొరబాట్ల ఓట్లను కాపాడాలన్నది రాహుల్ గాంధీ ఉద్దేశ్యం అని నిందించారు. రాహుల్ కుట్ర కుతంత్రాలు అన్నీ ప్రజలకు అర్థం అయ్యాయని అమిత్ షా విమర్శించారు. అందుకే ఈ దేశ ప్రజలు ఆయన కుట్రల వలలో చిక్కుకునే ప్రసక్తి లేదని కూడా అమిత్ షా స్పష్టం చేశారు.
మరోసారి విజయం :
ఇక 2029 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి మరోసారి విజయం తధ్యమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ అండ్ ఆయన మిత్రులకు పరాజయం పలకరించడం ఖాయమని అమిత్ షా జోస్యం చెప్పారు. బీజేపీ భారీ మెజారిటీని సొంతం చేసుకోబోతోంది అని అమిత్ షా అంటున్నారు. ఈ దేశ ప్రజలు ఎల్లప్పుడూ బీజేపీకి మోడీకి అండగా నిలబడతారు అని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ విజయాలను ప్రజల ఆదరణను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. వరసగా నాలుగోసారి బీజేపీ ఈ దేశంలో గెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ దాని మిత్రులకు నాలుగవసారి ఓటమి దక్కనుంది అని అమిత్ షా నమ్మకంగా చెబుతున్నారు. బీజేపీ మళ్ళీ గెలుస్తుంది అనడానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం అని అమిత్ షా చెప్పారు. త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, అస్సాం ప్రజలు బీజేపీని గెలిపించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియచేశరు. ఈ రోజున దేశంలో విపక్షం చేస్తున్న దుష్ప్రచారాల మధ్య కూడా ప్రజలు బీజేపీపై ఎన్డీయేపై నమ్మకం ఉంచారని అమిత్ షా గుర్తు చేశారు.
ప్రజాదరణ పొందలేరు :
అమిత్ షా మాటల బట్టి చూస్తూంటే అబద్ధాలనే జనంలో ఉంచి ప్రచారం చేస్తున్న వారు ఎపుడూ విజయాలను పొందలేరని అంటున్నారు. సర్ ప్రక్రియను అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ అండ్ కో సాగిస్తున్న దుష్ప్రచారన్ని దేశమంతా గమనిస్తోంది అని అమిత్ షా అంటున్నారు. కాంగ్రెస్ కల్పిత మీడియా ఈవెంట్లు, నిరంతర అబద్ధాల ద్వారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం సాధ్యం కాదని అమిత్ షా హితవు పలికారు. దీంతో పాటు గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ జనం లోకి వెళ్లలేదని బీజేపీ నిర్ధారణ చేసినట్లు అయింది. కాంగ్రెస్ మిత్రుల మాటలు ఉద్యమాలకు అంత విశ్వసనీయత లేదన్నది బీజేపీ భావనగా ఉంది. ఉప ఎన్నికల ఫలితాలు కూడా కమలం పార్టీలో విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని అంటున్నారు. మరి అమిత్ షా చెప్పిన ఈ జోస్యం మీద రాహుల్ ఆయన బృందం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
