అమిత్ షాకు అత్యున్నత ప్రాధాన్యత ?
కేంద్రంలో నరేంద్ర మోడీ పన్నెండేళ్ళ పాలనలో అతి ముఖ్య నాయకుడిగా మోడీ తరువాత ప్లేస్ లో కనిపించేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని అంతా అంటారు, అది ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు.
By: Satya P | 1 July 2026 11:00 PM ISTకేంద్రంలో నరేంద్ర మోడీ పన్నెండేళ్ళ పాలనలో అతి ముఖ్య నాయకుడిగా మోడీ తరువాత ప్లేస్ లో కనిపించేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని అంతా అంటారు, అది ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. 2014 నుంచి 2019 మధ్య మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయినపుడు అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కీలక భూమిక పోషించారు. పార్టీని ఆయన ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతీ ఎన్నికలోనూ బీజేపీకి విజయాలు ఘనంగా దక్కేలా చేశారు. అయితే 2019 తరువాత రెండవసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయినపుడు ఆ ఎన్నికల్లో లోక్ సభ నుంచి గెలిచిన అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా ముఖ్య బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి ఏడేళ్ళుగా ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. దేశంలో హోం మంత్రిగా అధిక కాలం కొనసాగిన ఘనతని ఇప్పటికే సాధించిన అమిత్ షా మరో మూడేళ్ల పాటు అదే హోదాలో ఉండనున్నారు.
హోం మంత్రిగా అమిత్ షా :
ఇక కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఖాతాలో అనేక విజయాలు ప్రభుత్వ పరంగా ఉన్నాయి. కాశ్మీర్ ఇష్యూనే తీసుకుంటే ఏడు దశాబ్దాలకు పైగా ఉన్న 370 అధికరణం కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ దేశం నుంచి ప్రత్యేకంగా కాశ్మీర్ ని చూపిస్తూ వచ్చింది. దానిని పూర్తిగా పక్కన పెట్టి 370 ఆర్టికల్ ని రద్దు చేసిన ఘనత కేంద్ర హోం మంత్రిగా అమిత్ షాకే దక్కుతుందని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా పౌర సత్వ సవరణ చట్టం ఆమోదం, 2023లో కొత్త నేర చట్టాలను తీసుకుని రావడం వంటివి అమిత్ షా ఖాతాలోనే పడిన విజయాలుగా అంతా చూస్తున్నారు.
కొత్త మలుపుగానే :
ఇక దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో శాంతి కోసం ఏకంగా 12 చారిత్రాత్మక ఒప్పందాలను దాదాపుగా 11 వేల మంది తీవ్ర వాదులను జన జీవన స్రవంతిలోకి తీసుకుని రావడంలో అమిత్ షా హోం మంత్రిగా ముఖ్య పాత్ర పోషించారు. ఇక చెప్పిన మాట ప్రకారం 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించి అందులో సక్సెస్ అయిన తీరు పట్ల కూడా అమిత్ షాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత బీజేపీ అక్కడ విజయం సాధించింది. ఆ వెంటనే బంగ్లాలో అక్రమ చొరబాట్లు లేకుండా మొత్తం సరిహద్దులలో ఫెన్సింగ్ ఏర్పాటుకు శ్రీగ్ర చర్యలు చేపట్టడం కూడా అమిత్ షా పనితీరుకు అద్దం పడుతోంది అని అంటున్నారు. ఇక ఇదే ఏడాది జూన్ లో హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల మధ్య చారిత్రాత్మకమైన యమునా జలాల ఒప్పందాన్ని కుదర్చడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పరంగా అనేక విజయాలలో అమిత్ షా ముద్ర బలంగా ఉంది.
ఆయనకు అమిత ప్రాధాన్యత :
ఈ నేపధ్యంలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో అమిత్ షాకు అమిత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీలో అలాగే ప్రభుత్వంలో కూడా చర్చ సాగుతోంది. ఆరున్నర పదుల వయసులో ఉన్న అమిత్ షా జాతీయ రాజకీయాల్లో చూసుకుంటే చురుకైన నేతగానే చెప్పుకోవాల్సి ఉంది. మోడీ ప్రభుత్వంలో కేంద్ర బిందువుగా ఉంటూ ఎన్నో విజయాలను ప్రభుత్వం సొంతం చేసిన అమిత్ షా చేసిన సేవలకు గానూ ఈసారి ప్రభుత్వంలో ఆయనకు పెద్ద పీట అగ్ర తాంబూలం దక్కుతుందని చర్చ అయితే సాగుతోంది. మరి ఆ స్థానం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
