Begin typing your search above and press return to search.

స్టాలిన్ మీద వారసత్వం అస్త్రం... వర్కౌట్ అవుతుందా ?

బీజేపీ గురించి చాలానే చెప్పుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అదే మాట్లాడుతుంది.

By:  Satya P   |   5 Jan 2026 9:16 AM IST
స్టాలిన్ మీద వారసత్వం అస్త్రం... వర్కౌట్ అవుతుందా ?
X

బీజేపీ గురించి చాలానే చెప్పుకోవాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అదే మాట్లాడుతుంది. బీజేపీ నిజంగా కుటుంబ రాజకీయాలకు అనుకూలమా కాదా అంటే ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది వారసులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర ఉంది. ఇక ఎన్డీయేలో ఎంతో మంది కుటుంబ పార్టీలను నడుపుతున్నారు. అయినా వారు తమ పక్కన ఉండడంతో వారి జోలికి వెళ్లడం లేదు అని అంటారు. ఉదాహరణకు కర్ణాటకలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి వారసత్వం నుంచి వచ్చిన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. దేవే గౌడ సీఎం కుమార స్వామి సీఎం గా చేశారు, ఇపుడు కుమార స్వామిని కేంద్ర మంత్రిగా చేసింది బీజేపీనే. కుమార స్వామి కుమారుడు కూడా జేడీఎస్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. దాంతో ఆ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాల గురించి బీజేపీ పెద్దగా మాట్లాడదు అంటారు.

ఏపీలో సైతం :

అదే విధంగా చూస్తే ఏపీలో ఒకే మంత్రివర్గంలో తండ్రీ కొడుకులు చంద్రబాబు లోకేష్ ఉన్నారు. బాబు సీఎం అయితే లోకేష్ కీలక శాఖల మంత్రి. ఇక బావమరిది ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా వారసులు ఉన్న చోట బీజేపీ ఆ ఊసే ఎత్తడం లేదు అన్న విమర్శ ఉంది. ఉత్తరాదిన కూడా చాలా చోట్ల తండ్రుల స్థానంలో కుమారులను ముందు పెట్టి బీజేపీ రాజకీయం నడిపింది. శివసేన అధినేత బాల సాహెబ్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ థాకరేతో కలసి పోటీ చేసింది. ఆయన వారసత్వాన్ని అంగీకరించింది.

కుటుంబ రాజకీయం :

కానీ తమిళనాడులో మాత్రం కుటుంబ రాజకీయం సాగుతోంది అని బీజేపీ అగ్రనేత హోం మంత్రి అమిత్ షా గట్టిగా గర్జిస్తున్నారు. ఆయన తాజాగా తమిళనాడులో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కరుణానిధి సీఎం కుమారుడు స్టాలిన్ సీఎం, ఇపుడు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సీఎం గా రాబోతున్నారు, అయితే ఆ అవకాశం మీకు ఇవ్వమని బిగ్ సౌండ్ చేశారు. తమిళనాడు ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలను అంగీకరించరు అని అమిత్ షా చెప్పారు. ఇక వచ్చేది డీఎంకే కానే కాదని ఆ పార్టీ అవినీతితో కూరుకుని పోయిందని కూడా విమర్శలు చేశారు. మేలో జరిగే ఎన్నికల్లో అధికారం చేపట్టేది కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వమే అని ఆయన జోస్యం చెప్పారు.

జనాల మూడ్ ఏంటి :

తమిళనాడులో వారసత్వ రాజకీయాల మీద చెడు అభిప్రాయం అయితే లేదు అని గత చరిత్ర నిరూపిస్తోంది. లేకపోతే అన్నా డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణిస్తే రాజకీయంగా ఏమీ తెలియని ఆయన సతీమణిని తెచ్చి సీఎం గా కూర్చోబెట్టారు. ఇక జయలలిత ఆయనతో కలసి పనిచేశారు అని ఆమెను వారసురాలిగా ఎన్నుకున్నారు. అలా మూడు సార్లు జయలలిత సీఎం అయ్యారు. కరుణానిధి విషయం తీసుకుంటే కుమారుడు స్టాలిన్ ని ఏనాడో రాజకీయంగా రంగంలో ఉంచారు. ఆయన ఒక్కరే కాదు పెద్ద కుమారుడు అళగిరిని అలాగే కుమార్తె కనిమొళిని కూడా రాజకీయాల్లోకి తెస్తే జనాలు ఆదరించారు. అది చాలదన్నట్లుగా మేనల్లుళ్ళలను సైతం రాజకీయాల్లోకి తెచ్చారు కరుణానిధి. అక్కడ ప్రజలకు తమ నాయకుడు అన్న విపరీతమైన ప్రేమ ఉంటుంది. వారి కుటుంబం అంటే ఎంతో అభిమానం చూపిస్తారు. అందుకే డీఎంకే అన్నా డీఎంకే అలా కొనసాగుతున్నాయి. బొమ్మ ఉంటే చాలు ఓట్లు వేస్తారు. అందువల్ల అమిత్ షా అంటున్నట్లుగా వారసత్వ రాజకీయ విమర్శలు అయితే అక్కడ ఏ మేరకు వర్కౌట్ అవుతాయన్నది చూడాల్సిందే.