Begin typing your search above and press return to search.

ఈ బిల్లు పాస్ అయితే చంద్రబాబు రేవంత్ సీఎం పదవి పోతుందా ?

ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టే బిల్లు అని విపక్షాలు అంటున్నాయి.

By:  Satya P   |   20 Aug 2025 6:13 PM IST
ఈ బిల్లు పాస్ అయితే చంద్రబాబు రేవంత్ సీఎం పదవి పోతుందా ?
X

ఈ రోజు ఒక కీలకమైన బిల్లుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు చూస్తే చాలానే ఉన్నాయి. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండే సందర్భంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా ఈ బిల్లుని రూపొంచారు ఈ బిల్లుని అనేకమైన నిబంధనలతో రూపొందించారు. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టడంతోనే మొత్తంగా విపక్షాలు వ్యతిరేకించాయి.

ఇంతకీ ఏముంది ఆ బిల్లులో :

ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టే బిల్లు అని విపక్షాలు అంటున్నాయి. ఈ బిల్లు కనుక చట్టం అయితే కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి ఆ మీదట అరెస్టయి నెల రోజులు కస్టడీలో ఉంటే చాలు 31వ రోజున వారు మాజీ అయినట్లే. వారి సమ్మతి లేకపోయినా వారి పదవి ఊడినట్లే. అలా ఆటోమేటిక్ గా పదవి పోయేలా కీలకమైన నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. ఇక కొంతమంది అయితే తాము పదవులకు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం దానికదే వర్తిస్తుంది. దాంతో పదవిని వెంటనే కోల్పోతారు. అందుకే దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

ద్వజమెత్తిన ప్రియాంకా గాంధీ :

ఇక ఈ బిల్లు కనుక అమలులోకి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన దర్యాప్తు సంస్థలతో అక్రమ అరెస్టులు చేయించి వారిని జైలు పాలు చేస్తే చాలు 31న రోజున పదవి కోల్పోతారు అని విమర్శించారు. ఈ విధంగా విపక్షాల ముఖ్యమంత్రులు మంత్రులను తొలగించే విధంగా ఈ బిల్లు ఉందని ఆమె ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామిక మూలాలను దెబ్బ తీసేదిగా ఆమె అభివర్ణించారు.

విపక్షం మూకుమ్మడిగా :

ఈ బిల్లుని అసలు ప్రవేశపెట్టే ఆలోచననే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ బిల్లు కనుక చట్టం అయితే మాత్రం కార్యనిర్వాహక సంస్థలే జడ్జీ స్థానంలోకి వస్తాయని వారే శిక్ష అమలు చేసే వారుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వారికి అపరిమిత అధికారాలు లభిస్తాయని అదే విధంగా విపక్షంలో ఉండే ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయవచ్చునని ఆయన విమర్శించారు.

బాబు రేవంత్ లకు ముప్పేనా :

ఏపీలో చంద్రబాబు 2023లో అరెస్టు అయ్యారు. ఆయన ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. మరి ఈ బిల్లు ప్రకారం చూస్తే 30 రోజులు జైలులో ఉంటే చాలు ఇక వారి పదవి ఊడినట్లే. ఆ విధంగా చంద్రబాబుకు కూడా ఈ బిల్లు వల్ల ఇబ్బందే అంటున్నారు. అంతే కాదు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో అరెస్టు అయి చాలా కాలం జైలులో ఉన్నారు. అది కూడా 30 రోజుల పై మాటే. మరి ఆయన సంగతి కూడా ఇంతేనా అని చర్చించుకుంటున్నారు.

జగన్ సైతం అదే విధంగా :

ఇక వైసీపీ అధినేత జగన్ గతంలో పదహారు నెలలు ఏకంగా జైలులో ఉన్నారు. ఇక ఆయన మీద కొత్తగా కేసులు పెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపథ్యంలో ముప్పయి రోజులు జైలులో ఉంటే చాలు పదవీ భ్రష్టత్వం అంటే ఇక జగన్ సీఎం అయ్యే చాన్స్ ఉందా లేదా అన్నది మరో చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే ఈ బిల్లు విపక్షాల మీద ప్రయోగించిన అస్త్రంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీఎవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

బీజేపీ కూడా కార్నర్ :

ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రేపటి రోజున విపక్షంలోకి వస్తే అపుడు ఇదే బిల్లు ఆ పార్టీకి కూడా ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు. మరి బీజేపీ ఏమి ఆశించి ఈ బిల్లుని తెచ్చిందో తెలియదు కానీ అన్ని పార్టీలు విపక్షంలో వ్యతిరేకిస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో సైతం దీని మీద చర్చ సాగుతోంది. ఒక వ్యక్తి మీద కేసు నమోదు అయినపుడు కానీ అతను జైలులో ఉన్నపుడు కానీ నిందితుడు మాత్రమే అవుతారు అన్నది నిపుణులు చెప్పే మాట. నేరం రుజువు అయితే అపుడు అతను నేరస్థుడు అవుతారు. అలా కాకుండా ముందే పదవికి ఎసరు వస్తుందని కలవరపడుతున్నారు. మరి బీజేపీ వ్యూహం ఏమిటి అన్నది అయితే అర్ధం కావడం లేదనే అంటున్నారు.