Begin typing your search above and press return to search.

ఒక్క డాలర్.. 15 లక్షల రియాల్స్.. చరిత్రలోనే అత్యల్పం

గడిచిన యాభై ఏళ్లలో అమెరికా కన్ను పడి.. ఆర్థిక ఆంక్షలు మొదలు ప్రత్యక్ష సైనిక దాడుల వరకు అనేక దేశాల మీద చర్యలు చేపట్టింది.

By:  Garuda Media   |   28 Jan 2026 12:32 PM IST
ఒక్క డాలర్.. 15 లక్షల రియాల్స్.. చరిత్రలోనే అత్యల్పం
X

ఎవరితోనైనా పెట్టుకో.. అగ్రరాజ్యం అమెరికాతో మాత్రం పెట్టుకుంటే అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం తాను టార్గెట్ చేసిన దేశాన్ని ఎంతలా అణిచి వేస్తుందో? ఆయా దేశాధినేతల్ని ఎంతలా వెంటాడి వేధిస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన యాభై ఏళ్లలో అమెరికా కన్ను పడి.. ఆర్థిక ఆంక్షలు మొదలు ప్రత్యక్ష సైనిక దాడుల వరకు అనేక దేశాల మీద చర్యలు చేపట్టింది.

ఆ జాబితాను చూస్తే.. అఫ్గానిస్తాన్.. ఇరాక్.. లిబియా.. సిరియా.. యెమెన్.. పనామా.. గ్రెనడా.. వెనిజులాలపై ప్రత్యక్ష దాడులకు పాల్పడితే.. ఆర్థిక ఆంక్షల్ని ఇరాన్.. రష్యా.. ఉత్తర కొరియా..క్యూబా.. చైనా.. భారత్ సహా పలు దేశాలు ఎదుర్కొన్నాయి. అదే సమయంలో తనకు నచ్చని దేశాల్లోని ప్రభుత్వాధినేతల్ని ఇట్టే మార్చేసే టాలెంట్ అగ్రరాజ్యం వద్ద టన్నుల కొద్దీ ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఆయా దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకొని.. అక్కడ తనకు అనుకూలంగా వ్యవహరించే నేతల్ని ప్రభుత్వాధినేతలుగా నియమించే ధోరణి అగ్రరాజ్య చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ఈ జాబితాలో హైతీ..యుగోస్లేవియా.. సోమాలియా.. లెబనాన్.. సూడాన్.. పాకిస్తాన్.. నైజీరియా.. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో వేలెట్టిన వైనం కనిపిస్తుంది. తాజాగా ఇరాన్ ను టార్గెట్ చేసిన వైనం తెలిసిందే. మరోవైపు గ్రీన్ ల్యాండ్ ను..కెనడాను సొంతం చేసుకోవాలన్న తన ఆలోచనను ఓపెన్ గా చెప్పేశారు ట్రంప్.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను టార్గెట్ చేసిన దేశాలు ఆర్థికంగా ఎంత దారుణంగా నష్టపోతాయనటానికి ఇరాన్ ఇప్పుడు నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ దేశ కరెన్సీ (రియాల్) చరిత్రలో ఎప్పుడూ లేనంత దారుణంగా కనిష్ఠ స్థాయికి దిగజారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అగ్రరాజ్యం అమెరికాతో నడుస్తున్న పంచాయితీ ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తీసింది. ఇరాన్ కరెన్సీ దారుణ స్థితికి చేరుకుంది.

జనవరి 27 (మంగళవారం) చరిత్రలో మరెప్పుడూ లేనంత ఘోర స్థితికి ఇరాన్ కరెన్సీ (రియాల్) చేరుకుంది. ఒక అమెరికన్ డాలర్ కు ఏకంగా 15 లక్షల రియాల్స్ కు చేరుకున్న దుస్థితి. అణ్వస్త్ర కార్యక్రమాల కారణాల నేపథ్యంలో ఇరాన్ తీవ్రమైన ఆర్థిక ఆంక్షల్ని ఎదుర్కొంటోంది. దీంతో.. రియాల్స్ విలువ పాతాళానికి పడిపోతోంది. ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ కు 15 లక్షల రియాల్స్ ఇస్తుంటే.. యాభై ఏళ్ల క్రితం అమెరికా డాలర్ వర్సెస్ ఇరాన్ రియాల్ చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

యాభై ఏళ్ల క్రితం అంటే 1976లో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు 68.7 ఇరానియన్ రియాల్స్ గా ఉండేది. ఆ తర్వాత నుంచి కాస్త కాస్త పడిపోవటం మొదలైంది. 1979 నాటికి 70 రియాల్స్ ఉండగా.. పదేళ్ల క్రితం (2016) ఒక అమెరికా డాలర్ కు 30,914 రియాల్స్ సమాధానం ఇచ్చిన పరిస్థితి. బహిరంగ మార్కెట్ లో 34వేల రియాల్స్ ఇచ్చినట్లుగా చెబుతారు. అదే డాలర్ ఇప్పుడు ఏకంగా 15 లక్షల రియాల్స్ కు కానీ చేతికి రాని రాతను చూస్తే.. అమెరికా పగను ఎదుర్కోవటం అంత తేలికైన విషయయం కాదన్నది అర్థమవుతుంది.