అమెరికాలో రూ.కోటి జీతం ఇస్తామన్నా ఎవరూ రావట్లేదు
జనాలు ట్రెండ్ ఫాలో అవుతారు. సాఫ్ట్ వేర్ అంటే లక్షల్లో జీతం.. ఏసీలో పని.. వీకెండ్ సెలవు. ఇలా సకల సౌకర్యాలు ఉండబట్టే ఆ ఉద్యోగం వెంట అందరూ పడుతున్నారు.
By: A.N.Kumar | 8 Jan 2026 11:00 PM ISTజనాలు ట్రెండ్ ఫాలో అవుతారు. సాఫ్ట్ వేర్ అంటే లక్షల్లో జీతం.. ఏసీలో పని.. వీకెండ్ సెలవు. ఇలా సకల సౌకర్యాలు ఉండబట్టే ఆ ఉద్యోగం వెంట అందరూ పడుతున్నారు. అయితే అంతకుమించిన డిమాండ్ ఉన్న కొన్ని మెకానిక్ ఉద్యోగాల్లో అసలు ఎవరూ చేరడం లేదు. ఏడాదికి కోటి రూపాయల వేతనం ఇస్తామన్నా అమెరికాలో అసలు ఎవరూ చేరడం లేదట.. దీంతో ఓనర్లు ఈగలు తోలుకుంటూ నిట్టూరుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
అమెరికాలో టెక్ విప్లవం తర్వాత వైట్ కాలర్ జాబ్ లపై ప్రజల్లో విపరీతమైన ఆసక్తి వచ్చింది. లక్షల్లో జీతాలు, శారీరక శ్రమ తక్కువ, జీతం కాకుండా కంపెనీ ఇచ్చే ప్రోత్సహాకాలు, జీతాల పెంపు.. ఇలా చాలా కారణాలతో బ్లూ కాలర్ ఉద్యోగాల పట్ల ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది. బ్లూ కాలర్ ఉద్యోగాలంటే తక్కువ చదివిన వాళ్లు, లేదా అసలే చదవని వాళ్లు చేసే ఉద్యోగాలుగా మారిపోయాయి. అందరూ వైట్ కాలర్ ఉద్యోగాల వైపు పరుగులు తీశారు. ఒకరు ఉద్యోగం నుంచి రిటైర్ అయితే పది మంది ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసే వారు తక్కువయ్యారు. ఐదుగురు రిటైర్ అయితే.. ఇద్దరు మాత్రమే వస్తున్నారు. దీంతో బ్లూ కాలర్ ఉద్యోగాలు వేలల్లో కాదు లక్షల్లో ఖాళీ ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరగబోతోంది.
ఏఐ విప్లవంతో డేటా సెంటర్ల ఏర్పాటు భారీగా జరగబోతోంది. డేటా సెంటర్లకు మెకానిక్లు, ప్లంబర్లు, ఇతర బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసే వారు చాలా అవసరం. ప్రస్తుతం ప్రజలు బ్లూ కాలర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం శారీరక శ్రమ కావొచ్చు, తక్కువ జీతాలు, సమాజంలో గౌరవం లేకపోవడం కావచ్చు. కారణం ఏదైనా బ్లూ కాలర్ ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యం గల శ్రామికులు దొరకడం కష్టం. ఇప్పుడు ఫోర్డ్ కంపెనీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఫోర్డ్ సీఈవో జిమ్ ఫార్లీ ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. ఫోర్డ్ కంపెనీలో 5వేల మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. కానీ చేరడానికి ఎవరూ రావడం లేదు. ఇది చాలా పెద్ద సమస్య అని జిమ్ ఫార్లీ అంటున్నారు. కానీ అమెరికాలో దీని గురించి సరైన స్థాయిలో చర్చ జరగడం లేదంటున్నారు. సంవత్సరానికి దాదాపు మన రూపాయల్లో కోటి రూపాయల దాకా జీతం ఇచ్చినా, నైపుణ్యం గల ఉద్యోగులు దొరకడం లేదట.
కోటి రూపాయల జీతం ఇవ్వడం నిజమే కానీ అది అంత సులువుగా సాధ్యం కాదు. కనీసం కంపెనీలో ఐదేళ్లు పనిచేయాలి. ఒక్కోసారి పదేళ్లూ కావొచ్చు. అందరికీ ఒకే సమయం పట్టకపోవచ్చు. దీనితో పాటు శారీరక శ్రమ అధికంగా ఉండటం, ఈ ఉద్యోగాలు చేసే వారికి వాహన సదుపాయం లేక, సొంతంగా వాహనం సమకూర్చుకోవాల్సి రావడం, గాయాలైతే ఒక్కోసారి నెలలపాటు ఇంటికే పరిమితం కావడంలాంటి అనేక సమస్యల కారణంగా ఈ ఉద్యోగాలకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఐటీ ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే.. బ్లూ కాలర్ ఉద్యోగాల్లో మాత్రం భారీగా ఖాళీలు ఉన్నాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2028 నాటి 3.45 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయట. ఐదుగురు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇద్దరే పనిలో చేరేందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో 21 లక్షల ఉద్యోగ ఖాళీలు అమెరికాలో ఏర్పడే అవకాశం ఉందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైట్ కాలర్ ఉద్యోగాలకు భారీగా కోత పెట్టబోతుందన్న వాదన ఉంది. అదే సమయంలో భారీ స్థాయిలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు స్థానం కల్పించబోతోందన్న చర్చ ఉంది.
