భారతీయుడిని పెళ్లి చేసుకున్న విదేశీ మహిళ అనుభవం... వైరల్ వీడియో!
వివాహం అనంతరం దాదాపు ప్రతీ మహిళ, మరో ఇంటికి వెళ్తుంది. మరో ఊరు వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మరో రాష్ట్రానికీ వెళ్తుంది.
By: Raja Ch | 29 July 2025 4:00 PM ISTవివాహం అనంతరం దాదాపు ప్రతీ మహిళ, మరో ఇంటికి వెళ్తుంది. మరో ఊరు వెళ్తుంది. కొన్ని సందర్భాల్లో మరో రాష్ట్రానికీ వెళ్తుంది. ఇటీవల కాలంలో మరో దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాను వదిలి భారత్ వచ్చి సంతోషంగా జీవిస్తున్న మహిళ.. సమాజంలో ఎదుర్కొన్న అనుభవాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది.
అవును... సుమారు గత పంతొమ్మిది సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ మహిళ.. భారతీయులను వివాహం చేసుకున్నప్పుడు విదేశీయులు తరచుగా వినే అసంబద్ధ విషయాలను వివరిస్తూ చేసిన వీడియోను షేర్ చేసింది. ఈ క్రమంలో... తాను ఎదుర్కొన్న సవాళ్లపై ఆమె నిజాయితీగా తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఎన్నో విషయాలపై స్పష్టత ఇస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... జెస్సికా అనే అమెరికా మహిళ.. ఒక బిహారీ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా... ఆమె మొదటిసారి భారతదేశానికి వచ్చిన సమయాన్ని గుర్తుచేసుకుంది. ఆమె ప్రస్తుతం తన భర్త, పిల్లలు, అత్తమామలతో ఢిల్లీలో నివసిస్తున్నారు. ఈ సందర్భంగా... 'భారతీయులను వివాహం చేసుకున్న విదేశీయులకు ట్రోల్స్ చెప్పే అసంబద్ధమైన విషయాలు' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... తాను రోజూ చూసే వర్ణ వివక్ష, జాత్యహంకారం, తెల్లటి చర్మం, పాశ్చాత్య పాస్ పోర్ట్ కు సంబంధించిన ఆరాధనకు ఒక శాంపిల్ మాత్రమే అని హామీ ఇస్తున్నట్లు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. జెస్సికా.. తాను ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నందుకు రోజూ ఎదుర్కోవాల్సిన వివక్ష గురించి ఈ వీడియో క్లిప్ లో వివరంగా చెప్పింది.
ఈ సందర్భంగా... ఆమె ప్రస్తావించిన వ్యాఖ్యలలో... "మీ భర్త గ్రీన్ కార్డ్ కోసం మిమ్మల్ని వివాహం చేసుకున్నాడు" అనేది ఒకటికాగా... "తాను నల్లటి చర్మం గల వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ప్రజలు బాధపడ్డారు" అని కూడా ఆమె అన్నారు. ఇదే సమయంలో... "నువ్వు భారతదేశానికి వెళ్లి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు" అనే విమర్శను తాను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
అదేవిధంగా.. "నీ పిల్లలు నీలా తెల్లగా లేకపోవడం బాధాకరం" అనేవి ఆమె జాబితాలోని మరికొన్ని వ్యాఖ్యలుగా ఉన్నాయి. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. కామెంట్ సెక్షన్ లోనూ నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను సూటిగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా.. “అతడు మిమ్మల్ని నిజంగా గ్రీన్ కార్డు కోసమే వివాహం చేసుకుని ఉంటే... ఇంతకాలంగా భారత్ లోనే ఎందుకు ఉంటారు.. అది గ్రీన్ కార్డు ప్రేమ కాదు.. నిజమైన ప్రేమ” అని ఒకరు స్పందించగా... “ఆ పనికిమాలిన మొరుగుల్లు పట్టించుకోవద్దు.. జీవితాన్ని సంతోషంగా జీవించండి” అని మరికరు అంటున్నారు!
