క్విక్ డెలివరీ తీరుపై అమెరికన్ పారిశ్రామికవేత్త సంభ్రమాశ్చర్యం
మనకు అదే పనిగా అలవాటైన విషయాలు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించవు. కానీ.. విదేశీయులు మాత్రం నోరెళ్లబెట్టి చూస్తారు.
By: Garuda Media | 12 Dec 2025 10:00 AM ISTమనకు అదే పనిగా అలవాటైన విషయాలు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించవు. కానీ.. విదేశీయులు మాత్రం నోరెళ్లబెట్టి చూస్తారు. గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్న మనోళ్లు సెలవులకు భారత్ కు వచ్చిన సందర్భంగా ఇక్కడి పేటీఎం.. జీపే.. ఫోన్ పే తీరుకు అవాక్కు అవుతుంటారు. అంతేకాదు.. బిచ్చగత్తె మొదలు బిలియనీర్ స్టోర్ వరకు డిజిటల్ పేమెంట్ లో భారత్ సాధించిన విజయాలకు వారు అచ్చెరువు పొందుతూ.. పేరుకు ప్రాశ్చాత్య దేశంలో ఉన్నప్పటికి ఇలాంటివి తమకు లేవని చెప్పటం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాదు.. పలువురు విదేశీయులు భారత్ కు వచ్చినప్పుడు.. రోజువారీ జీవితంలో భారతీయులు తమ రోజువారీ జీవితంలో టెక్నాలజీని వాడేసే తీరుకు అవాక్కు అవుతుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని సదరు అమెరికన్ పారిశ్రామికవేత్త తనకు ఎదురైన ఆశ్చర్యకర ఘటన గురించి గొప్పగా ప్రస్తావించారు. భారతదేరశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పది నిమిషాల్లో డెలివరీ సేవలు అందుబాటులోకి రావటం.. కొన్ని సందర్భాల్లో ఆరేడు నిమిషాల్లోనే కోరుకున్న వస్తు సేవలు ఇంటి ముంగిట్లోకి వచ్చేస్తున్న తీరుపై తన విస్మయాన్ని వ్యక్తం చేశారు.
పది నిమిషాల్లో డెలివరీ అన్నది ఇప్పుడు మనకు కొత్తగా.. గొప్పగా పెద్దగా అనిపించకపోవచ్చు.కానీ.. విదేశీయులు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త జేమ్స్ బ్లంట్ ర్యాపిడ్ వేగంతో డెలివరీ అవుతున్న వస్తుసేవల తీరుపై విస్మయాన్ని వ్యక్తం చేస్తూ.. ఇక్కడి వేగానికి తాను ఫిదా అవుతున్నట్లుగా పేర్కొన్నారు.
యూరప్.. పశ్చిమాసియా దేశాలతో పాటు భారత్ లోనూ తాను అప్పుడప్పడు పర్యటిస్తుంటానని.. భారత్ లో తాను ఆర్డర్ చేసిన వస్తువు ఆరు నిమిషాల వ్యవధిలో తన డోర్ స్టెప్ వద్ద ఉండటంపై ఆయనెంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.అమెరికాలో తాను ఊబర్ ఈట్స్ లో పుడ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చేసరికి గంట సమయం పడుతుందని.. అందుకు భిన్నంగా భారత్ లో పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతటి తేడాకు కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించారు. ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా భారత్ సామర్థ్యాన్ని అత్యధికులు ప్రశంసించారు. అదే సమయంలో గిగ్ వర్కర్ల జీతాలు.. వారి శ్రమను ప్రస్తావించటం గమనార్హం.
