ప్లాన్-బి కాదు.. స్ట్రాటజిక్ రీలోకేషన్.. భారతీయ ఐటీ హబ్‌ల వైపు విదేశీ విద్యార్థుల చూపు!
ఒకప్పుడు భారతీయ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల జీవిత మార్గం చాలా స్పష్టంగా ఒకే మూసలో సాగిపోయేది.
By: A.N.Kumar | 16 Jun 2026 6:00 PM ISTఒకప్పుడు భారతీయ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థుల జీవిత మార్గం చాలా స్పష్టంగా ఒకే మూసలో సాగిపోయేది. ఇంటర్ లేదా బీటెక్ పూర్తి కావడం ఆలస్యం.. జీఆర్‌ఈ , ఐఎల్టీఎస్ కోచింగ్ సెంటర్లలో చేరడం, యూఎస్ ఫాల్ ఇన్‌టేక్ పట్టుకోవడం, ఆపై లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో "లివింగ్ ద డ్రీమ్ యూఎస్" అని స్టేటస్ పెట్టడం.. ఇదీ వరుస. చివరగా "మరో రెండేళ్లలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది" అంటూ ఇండియాలోని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంతో ఆ స్క్రిప్ట్ ముగిసేది. కానీ ఇప్పుడు ఆ పాత స్క్రిప్ట్‌లో ఊహించని పెద్ద ట్విస్ట్ వచ్చింది.
నౌకరీ.కామ్ , లింక్డ్‌ఇన్ ఇండియా, స్టార్టప్ కెరీర్స్ ఇండియా వంటి దేశీయ జాబ్ పోర్టల్స్‌లో విదేశాల్లో చదువుకున్న భారతీయ విద్యార్థుల ప్రొఫైల్స్ ఒక్కసారిగా వరదలా ప్రత్యక్షం కావడం మొదలైంది. ఇది చూసి చాలామంది తల్లిదండ్రులు మొదట్లో టెక్నికల్ లోపమో లేదా వీపీఎన్ సమస్యో అనుకున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. 'స్టూడెంట్ సర్కస్' అనే గ్లోబల్ కెరీర్ ప్లాట్‌ఫామ్ గణాంకాల ప్రకారం.. 2023 నుంచి 2024 మధ్య కాలంలో భారతదేశంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 89 శాతం పెరిగింది. ఈ మార్పును గమనించిన కొన్ని విదేశీ విద్యా కన్సల్టెన్సీలు అప్పుడే "రిటర్న్ టు ఇండియా ప్యాకేజీ" పేరుతో కొత్త బ్రోచర్లు కూడా సిద్ధం చేయడం విశేషం.
"అబ్రాడ్ అడ్వాంటేజ్" నుంచి "అబ్రాడ్ అడ్వెంచర్" వైపు..
గతంలో విదేశీ విద్య అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం సాగే నాలుగు అంచెల ప్రోగ్రామ్... చదువు, ఉద్యోగం, పీఆర్ సెటిల్‌మెంట్. కానీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు ఈ రోడ్‌మ్యాప్‌ను మార్చేశాయి. గ్లోబల్ మార్కెట్‌లో వీసా నిబంధనలు నానాటికీ కఠినంగా మారుతున్నాయి, ఉద్యోగ మార్కెట్ కుంచించుకుపోతోంది. చాలా కంపెనీలు ఫ్రెషర్లకు కాకుండా "కనీసం మూడేళ్ల అనుభవం కావాలి" అని కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు "అనుభవం కోసమే కదా మేము ఇక్కడికి వచ్చింది" అని తలలు పట్టుకుంటున్నారు. ఫలితంగా విదేశీ కలల రహదారిపై "అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిటోర్" బోర్డులు దర్శనమిస్తున్నాయి.
భారత్ ఇక 'ప్లాన్ బి' కాదు.. 'స్ట్రాటజిక్ రీలోకేషన్'
ఒకప్పుడు విదేశాల్లో ఎక్కడా ఉద్యోగం దొరకనప్పుడు మాత్రమే చివరి ఆప్షన్‌గా భారతదేశాన్ని గుర్తుచేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయ్యింది. "యూఎస్‌లో 400 అప్లికేషన్లు పంపినా ఒక్క రిప్లై రాలేదు.. అదే బెంగళూరు లేదా హైదరాబాద్‌లో రెండు ఇంటర్వ్యూలకే మంచి ఆఫర్ వచ్చింది" అనే కథనాలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి.
అయితే నేటి తరం విద్యార్థులు దీనిని "ఇండియాకు తిరిగొచ్చేయడం" అని అనడం లేదు. దానికి "స్ట్రాటజిక్ కెరీర్ రీలోకేషన్" లేదా "కెరీర్ రీక్యాలిబ్రేషన్" అనే టెక్నికల్ పేర్లు తగిలిస్తున్నారు. ఎందుకంటే 'తిరిగి వచ్చేశాను' అంటే సమాజంలో ఓటమిలా వినిపిస్తుందని.. అదే 'రీక్యాలిబ్రేట్ అయ్యాను' అంటే ఒక టెడ్ టాక్ స్పీకర్‌లా బిల్డప్ ఇవ్వవచ్చని నిపుణులు చమత్కరిస్తున్నారు.
విజయానికి మారుతున్న కొత్త ఫార్ములా
విజయానికి సంబంధించిన పాత నిర‍్వచనాలు వేగంగా మారుతున్నాయి. అమెరికాలో స్థిరపడటం.. లైఫ్‌లో సక్సెస్ అని మంచి ప్యాకేజీ, వేగవంతమైన గ్రోత్, వీసా ఆఫీసర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడని జీవితమే అసలైన సక్సెస్ అని అంటున్నారు. దీంతో ఇప్పుడు "నువ్వు ఏ దేశంలో ఉన్నావు?" అనే ప్రశ్న కంటే, "కార్పొరేట్ నిచ్చెనను ఎంత వేగంగా ఎక్కుతున్నావు?" అనే ప్రశ్నకే విలువ పెరుగుతోంది.
కన్సల్టెంట్లకు కొత్త సవాళ్లు
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే విదేశీ విద్యా కన్సల్టెంట్లు తమ పాత మార్కెటింగ్ స్లోగన్లను మార్చక తప్పదు దీనర్థం విదేశీ విద్యపై భారతీయుల్లో క్రేజ్ పూర్తిగా చనిపోయిందని కాదు. కాకపోతే విదేశీ కల ఇప్పుడు కొంచెం పరిణతి చెందింది. ప్రపంచాన్ని చూసి వచ్చాక విద్యార్థులు ఒక విషయాన్ని బలంగా గ్రహిస్తున్నారు. "సక్సెస్ అంటే ఒక నిర్దిష్టమైన అడ్రస్ కాదు.. మన చేతిలో ఉండే ఆప్షన్స్" అంటున్నారు.
అందుకే నేటి యువత "నేను అమెరికాలోనే ఉండిపోగలనా?" అని ఆలోచించడం లేదు.. "నా కెరీర్ వేగంగా ఎక్కడ పరుగెడుతుంది?" అని లెక్కలేస్తోంది. ఆ లెక్కల్లో ఇప్పుడు 'ఇండియా' అనే ఆప్షన్ ఎక్కడో కింద చిన్న ఫాంట్‌లో కాకుండా.. పేజీ పైనే బోల్డ్ లెటర్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
