Begin typing your search above and press return to search.

న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రోనే బెటర్.. అమెరికన్ మహిళ వైరల్ వీడియో

భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థ అనగానే విదేశీయులలో ఒక రకమైన తప్పుడు అంచనా ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో భారత్ సాధిస్తున్న మౌలిక వసతుల విప్లవం చూసి ఇప్పుడు విదేశీయులే ముక్కున వేలేసుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   20 Jun 2026 12:16 AM IST
న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రోనే బెటర్.. అమెరికన్ మహిళ వైరల్ వీడియో
X

భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థ అనగానే విదేశీయులలో ఒక రకమైన తప్పుడు అంచనా ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో భారత్ సాధిస్తున్న మౌలిక వసతుల విప్లవం చూసి ఇప్పుడు విదేశీయులే ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా 'లిజ్' అనే అమెరికన్ మహిళ ముంబై మెట్రో ప్రయాణాన్ని అనుభవించి, భారత రవాణా వ్యవస్థపై ప్రశంసల జల్లు కురిపించారు. "భారతదేశాన్ని చూసి అమెరికా ఎంతో నేర్చుకోవాలి" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

₹20లకే లగ్జరీ ప్రయాణం.. క్లీన్‌నెస్‌కు ఫిదా

లిజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ముంబై మెట్రో ఎక్స్‌పీరియన్స్' పేరుతో ఒక వీడియోను పంచుకున్నారు. ముంబైలో లోకల్ ట్రైన్లతో పాటు మెట్రో కూడా కోట్లాది మందికి జీవనరేఖగా మారింది. ఈ మెట్రోలో తొలిసారి ప్రయాణించిన ఆమె ఇక్కడి సదుపాయాలకు ఆశ్చర్యపోయారు. ఆమె తన వీడియోలో హైలైట్ చేసిన ముఖ్యమైన అంశాలు చూస్తే.. అత్యంత తక్కువ ధరకు కేవలం ₹20లకే ఇంతటి సురక్షితమైన, సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణం లభించడం విశేషమని ఆమె కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ సిటీ సబ్‌వే కంటే ముంబై మెట్రో ఎంతో శుభ్రంగా, పరిశుభ్రంగా ఉందని ఆమె కితాబిచ్చారు. మెట్రోలో మహిళల కోసం ప్రత్యేకంగా కోచ్‌లు కేటాయించడాన్ని ఆమె ఎంతగానో అభినందించారు. తాను ప్రయాణించిన ఇతర దేశాల్లో ఇలాంటి భద్రతా ఏర్పాట్లు చూడలేదని పేర్కొన్నారు. ముంబైలో విపరీతమైన వేడి ఉన్నప్పటికీ మెట్రో లోపల పవర్‌ఫుల్ ఎయిర్ కండిషనింగ్ ఎంతో హాయిని ఇచ్చిందని, ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్స్ ప్రయాణికులకు పూర్తి రక్షణను ఇస్తున్నాయని చెప్పారు. "నేను ముంబై మెట్రోలో మొదటిసారి ప్రయాణిస్తున్నాను. ఇక్కడి స్టేషన్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఈ మెట్రో అద్భుతం. అమెరికా ఖచ్చితంగా భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి." అని అమెరికన్ పర్యాటకురాలు లిజ్ పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల హర్షం

ఈ వీడియో నెట్‌లో ప్రత్యక్షం కాగానే భారీ వ్యూస్, లైకులతో దూసుకుపోతోంది. సాధారణంగా విదేశీయులు భారతదేశంలోని లోపాలను మాత్రమే చూపిస్తారని ఇలాంటి సానుకూల అంశాలు వైరల్ కావడం అరుదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. "వెల్కమ్ టు ముంబై.. మీ ప్రయాణం సుఖంతం కావాలి" అంటూ కొందరు నెటిజన్లు ఆమెకు స్వాగతం పలికారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "ఇలాంటి మంచి వీడియోలు వైరల్ కావు. బంగ్లాదేశ్ రైల్వే స్టేషన్లలో రైళ్లపై జనాలు ఉన్న వీడియోలను భారత్ పేరుతో వైరల్ చేస్తుంటారు. మన దేశ ప్రగతిని చూపించినందుకు ధన్యవాదాలు" అని కామెంట్ చేశారు. మరికొందరు నెటిజన్లు ఆమెకు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. "ఇండియాలో ముంబై మెట్రోనే కాదు.. వీలైతే ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో వ్యవస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న 'ఢిల్లీ మెట్రో'ను కూడా ఒకసారి సందర్శించండి" అని సూచించారు.

మొత్తానికి ఒకప్పుడు విదేశీయులు భారత్‌ను చూసి పెదవి విరిచే రోజులు పోయాయని, నేడు మన దేశ మౌలిక వసతులు, సాంకేతికత ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పడానికి లిజ్ చేసిన ఈ వీడియోనే ఒక నిదర్శనం.