అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంక్షోభం.. భారీగా ఉద్యోగాల కోత
అమెరికన్ ఎయిర్‌లైన్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నా, కోవిడ్ మహమ్మారి వదిలిన ఆర్థిక గాయం ఇంకా మానిపోలేదు.
By: A.N.Kumar | 4 Nov 2025 11:16 PM ISTఅమెరికన్ ఎయిర్‌లైన్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నా, కోవిడ్ మహమ్మారి వదిలిన ఆర్థిక గాయం ఇంకా మానిపోలేదు. ఈ నేపథ్యంలో సంస్థ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించబోతోందని సమాచారం వెలువడింది. ప్రధానంగా విమానాశ్రయ కార్యకలాపాలు, మేనేజ్‌మెంట్, సపోర్ట్ సిబ్బందిపై ఈ తొలగింపుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.
* పోస్ట్-కోవిడ్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక
కోవిడ్ సమయంలో విమానయాన పరిశ్రమ ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రయాణాలు నిలిచిపోవడంతో అనేక సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఆ సమయంలో నిర్వహణ కోసం అధిక సంఖ్యలో సిబ్బందిని నియమించుకున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఇప్పుడు ఆ సిబ్బందిని “Workforce Bloat”గా (అత్యధిక సిబ్బంది భారంగా మారడం) పేర్కొంటోంది. ఇక కార్యకలాపాలను సులభతరం చేయడం, ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగుల తొలగింపులు తప్పనిసరైందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
* పోటీ పెరిగిన నేపథ్యంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ దెబ్బతిన్న పరిస్థితి
ప్రత్యర్థి సంస్థలైన డెల్టా ఎయిర్‌లైన్స్ , యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇప్పటికే కోవిడ్ ప్రభావం నుండి బయటపడి, సాంకేతికతను వినియోగిస్తూ సామర్థ్యాన్ని పెంచాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆపరేషన్లను ఆటోమేట్ చేస్తూ, సహజంగా ఉద్యోగులు రిటైర్ అయ్యే వరకు వేచి చూసే వ్యూహం తీసుకుంది. ఈ విధంగా మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగులను 4% మేర తగ్గించింది.
కానీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాత్రం ప్రత్యక్షంగా ఉద్యోగాల కోత విధానం ఎంచుకోవడం గమనార్హం. తక్షణం ఖర్చు తగ్గుతుందనే ఆశతో ఈ మార్గం ఎంచుకున్నప్పటికీ, ఇది ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* ఉద్యోగుల మనోబలం.. సేవా నాణ్యతపై ప్రభావం
విమానయాన రంగంలో కస్టమర్ సర్వీస్ అత్యంత కీలక అంశం. ప్రతి ప్రయాణికుడి అనుభవం కంపెనీ ప్రతిష్ఠను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను భారీగా తొలగించడం వల్ల సర్వీస్ నాణ్యత తగ్గిపోవడం, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, బ్రాండ్ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ విశ్లేషకులు అంటున్నారు.
* ‘ప్రీమియం క్యారియర్’ లక్ష్యానికి విరుద్ధంగా?
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం తాను “ప్రీమియం క్యారియర్”గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఉద్యోగాల కోత వంటి చర్యలు ఈ దిశలో వెనకడుగు వేయించే ప్రమాదం ఉంది. ప్రయాణికుల సేవలను మెరుగుపర్చడం, సిబ్బందికి ప్రోత్సాహం ఇవ్వడం కంటే, ఉద్యోగాల కోతపై దృష్టి పెట్టడం వ్యూహాత్మకంగా తప్పిదమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* నిపుణుల హెచ్చరిక
“తాత్కాలికంగా ఖర్చులను తగ్గించడం పరిష్కారం కాదు. దీర్ఘకాలంలో ఈ నిర్ణయం సంస్థ ప్రతిష్ఠకు మరియు కస్టమర్ నమ్మకానికి ముప్పు కలిగించవచ్చు,” అని ఒక మార్కెట్ విశ్లేషకుడు పేర్కొన్నారు.
కోవిడ్ వెళ్లిపోయినా దాని నీడ ఇంకా కొనసాగుతోంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలోని ఇతర సంస్థలకు కూడా సంకేతమవుతుంది. భవిష్యత్‌లో ఈ నిర్ణయం ఆర్థికంగా సంస్థను బలపరుస్తుందా? లేక సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి సేవా నాణ్యతను తగ్గిస్తుందా? అన్నది సమయమే చెప్పాలి.
