అమెరికాలో కూరగాయల ధరలు తెలిస్తే ఫ్యూజులు అవుట్!
మన దేశంలో కూరగాయలు కిలో ముప్పై, నలభై రూపాయలకే దొరుకుతాయి. ముఖ్యంగా బెండకాయల ధర అమెరికాలో వింటే మీ గుండె గుభేల్ అనడం ఖాయం! అక్కడ కేజీ బెండకాయల ధర అక్షరాలా రూ.7,200 పలుకుతోంది
By: Madhu Reddy | 8 Jun 2026 1:00 AM ISTమన దేశంలో కూరగాయలు కిలో ముప్పై, నలభై రూపాయలకే దొరుకుతాయి. ముఖ్యంగా బెండకాయల ధర అమెరికాలో వింటే మీ గుండె గుభేల్ అనడం ఖాయం! అక్కడ కేజీ బెండకాయల ధర అక్షరాలా రూ.7,200 పలుకుతోంది. యూఎస్‌లో ఓ భారతీయ కంటెంట్ క్రియేటర్ ఈ రేట్లు చూసి అవాక్కై సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ రేట్ల గోల ఏంటో, నెటిజన్లు ఎలా నవ్వుకుంటున్నారో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆ ప్యాకెట్ ధర చూసి మైండ్ బ్లాక్:
అమెరికాలో ఉండే ఓ ఇండియన్ కంటెంట్ క్రియేటర్ అక్కడ ఒక సూపర్‌మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఫ్రై చేసి, స్నాక్ రూపంలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇక కేవలం 85 గ్రాములు ఉన్న ఆ ఒక్క చిన్న ప్యాకెట్ ధర 6.42 డాలర్లుగా ఉంది. ఆ లెక్కన చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక కిలో బెండకాయల ధర దాదాపు 7,200 రూపాయలు అవుతుందన్నమాట!
ధర అంత ఎక్కువగా ఉండటానికి కారణం?:
మన దేశంలో ప్రతి గల్లీలోనూ, మార్కెట్లలోనూ బెండకాయలు చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ అమెరికాలో పరిస్థితి అలా ఉండదు. అక్కడ బెండకాయల లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇండియా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, పైగా వాటిని ప్రాసెస్ చేసి స్నాక్స్‌గా మార్చడం వల్ల ఇంత భారీగా రేట్లు పెంచేస్తారని సదరు కంటెంట్ క్రియేటర్ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.
టమోటాలు, మిరపకాయల రేట్లు కూడా అంతే:
కేవలం బెండకాయలు మాత్రమే కాదు బాబోయ్, అమెరికాలో మన దేశీ కూరగాయలు దేన్నీ ముట్టుకున్నా షాక్ కొట్టాల్సిందే! మన ఊర్లలో చౌకగా దొరికే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమోటాలు మరియు కరివేపాకు లాంటి వాటి ధరలు కూడా అక్కడ డాలర్ల రూపంలో చుక్కలు చూపిస్తాయి. ఇండియన్ స్టోర్స్‌కు వెళ్తే తప్ప మన కూరగాయలు దొరకవు, దొరికినా జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. కిలో పచ్చిమిరపకాయలు రూ.600, కాకరకాయలు రూ.700 , దొండకాయలు రూ.900, గుత్తి వంకాయ రూ.600, మామిడికాయలు రూ.1200.. అక్కడ అన్నిటికంటే తక్కువ క్యాబేజీ మాత్రమే ఒక్కొక్కటి 150 రూపాయలు. సొరకాయ రూ.200, పొట్లకాయ 500, టమోటాలు 500.. చిక్కుడుకాయలు రూ.1000.. మెంతికూర కట్ట రూ.250.. చింతకాయలు కిలో రూ.1600.. ఈ ధరలు చూస్తే మాత్రం గుండె గుబేల్ అనాల్సిందే.
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్:
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మన ఇండియన్ నెటిజన్లు తమదైన స్టైల్లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగాలు మానేసి, అమెరికాకు ఒక ట్రక్కు నిండా కూరగాయలు ఎగుమతి చేసుకుంటే కోటీశ్వరులం అయిపోవచ్చు అని కొందరు, "ఇకపై వీటిని కూరగాయల మార్కెట్లో కాదు, బంగారు షాపుల్లో అమ్మాలేమో" అని మరికొందరు జోకులు పేలుస్తున్నారు.
పరాయి దేశానికి వెళ్లినప్పుడు మన ఊరి వంటలను, కూరగాయలను ఎంత మిస్ అవుతామో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అక్కడ జీతాలు ఎక్కువగా ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న వస్తువుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం గమనార్హం. ఏది ఏమైనా మన ఇండియాలో తక్కువ ధరకే అన్నీ తాజా కూరగాయలు దొరకడం మన అదృష్టమే కదా..
