వీసాలపై అంతా మా ఇష్టం.. అమెరికా స్పష్టం!
అమెరికా వలస విధానాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. గత కొంత కాలంగా వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా తన సార్వభౌమత్వాన్ని చాటుతూ కీలక వ్యాఖ్యలు చేసింది.
By: A.N.Kumar | 21 Dec 2025 11:42 PM ISTఅమెరికా వలస విధానాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. గత కొంత కాలంగా వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్న అమెరికా ప్రభుత్వం, తాజాగా తన సార్వభౌమత్వాన్ని చాటుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వీసా జారీ, రద్దు ప్రక్రియలపై స్పష్టతనిస్తూ.. వీసా అనేది ఎవరూ హక్కుగా భావించకూడదని.. అది కేవలం ఒక ప్రత్యేక అనుమతి మాత్రమేనని స్పష్టం చేశారు.
వీసాపై పూర్తి నియంత్రణ మాదే..
ఒక సార్వభౌమ దేశంగా అమెరికాలోకి ఎవరు ప్రవేశించాలి? ఎంతకాలం నివసించాలి అనే అంశాలపై తమకు పూర్తి నియంత్రణ ఉంటుందని రూబియో పేర్కొన్నారు. వీసాను కేవలం ఒక ‘విజిటర్ స్టేటస్’ గానే పరిగణించాలని ఆయన సూచించారు.
వీసా ఎప్పుడైనా రద్దు కావచ్చు..
చాలా మంది వీసా పొందిన తర్వాత ఇక తమకు తిరుగులేదని భావిస్తుంటారు. అయితే రూబియో ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. వీసా మంజూరు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఎప్పుడైనా దానిని రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. ఏ ఉద్దేశంతో వీసా తీసుకున్నారో దానికి భిన్నంగా వ్యవహరిస్తే తక్షణమే రద్దు చేస్తారు. స్థానిక చట్టాలను అతిక్రమించినా.. లేదా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించినా వీసా చెల్లకుండా పోతుంది.
జాతీయ భద్రతకు పెద్దపీట
అమెరికా జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ కఠిన వైఖరి అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. వీసా వ్యవస్థ పవిత్రతను కాపాడటం.. అర్హులైన వారికే అవకాశం కల్పించడం ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
వీసాదారుల బాధ్యత
అమెరికాలో ప్రవేశించడం ఎంత ముఖ్యమో అక్కడి చట్టాలను గౌరవిస్తూ బాధ్యతగా ఉండటం అంతే ముఖ్యమని రూబియో గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా విదేశాంగ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ సహా ఇతర దేశాల నుండి అమెరికా వెళ్లాలనుకునే వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపై వీసా నిబంధనల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
