Begin typing your search above and press return to search.

సిరియాపై మళ్లీ అమెరికా దాడులు.. మరో యుద్ధం తప్పదా?

అమెరికా డిఫెన్స్ నుంచి అమెరికా వార్ గా రక్షణ శాఖను మార్చాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నారు.

By:  A.N.Kumar   |   11 Jan 2026 11:42 AM IST
సిరియాపై మళ్లీ అమెరికా దాడులు.. మరో యుద్ధం తప్పదా?
X

అమెరికా డిఫెన్స్ నుంచి అమెరికా వార్ గా రక్షణ శాఖను మార్చాక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వెనుజువెలపై దాడి చేసిన అగ్రరాజ్యం ఏకంగా అక్కడి అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొని పట్టుకొచ్చింది. ఇక గ్రీన్ లాండ్ స్వాధీనం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు దాని కన్ను సిరియాపై పడింది. అక్కడ ప్రతీకార దాడులకు దిగింది.

సిరియాలో అరాచకానికి పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. అగ్రరాజ్యం తన సైనిక పటిమను ప్రదర్శిస్తూ సిరియాలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారీ స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించింది. అమెరికా సైనికులపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పెంటగాన్ వర్గాలు ధృవీకరించాయి.

దాడులకు కారణమిదే.. ప్రతీకారేచ్ఛతో రగిలిన అమెరికా

గత నెలలో సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఘాతుకంలో ఇద్దరు అమెరికా సైనికులు.. ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన అమెరికా రక్షణ శాఖ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. అమెరికా పౌరుల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ దాడుల ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపింది.

ట్రంప్ హెచ్చరిక.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

ఈ మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. అమెరికా సైనికులకు లేదా మన పౌరులకు హాని తలపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అటువంటి శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. అవసరమైతే భవిష్యత్తులో మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోము అని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

రణరంగంగా మారిన ఉత్తర సిరియా

అమెరికా యుద్ధ విమానాలు సిరియాలోని ఐసిస్ శిక్షణ శిబిరాలు, ఆయుధ డిపోలు.. కమ్యూనికేషన్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. ఉగ్రవాదుల కదలికలను ముందే పసిగట్టిన అమెరికా దళాలు, అత్యంత ఖచ్చితత్వంతో ఈ దాడులను పూర్తి చేశాయి.

భయాందోళనలో మధ్యప్రాచ్యం

సిరియాలో నెలకొన్న అస్థిరతను ఆసరాగా చేసుకుని ఐసిస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో అమెరికా జరిపిన దాడులు ఉగ్రవాద అణచివేతలో కీలకమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భద్రత పెరుగుతుంది. ఈ దాడుల వల్ల మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగి ఇతర దేశాల ప్రమేయానికి దారితీసే ప్రమాదం ఉంది.

సిరియా గడ్డపై శాంతి నెలకొంటుందా లేక ఈ దాడులు మరో పెద్ద యుద్ధానికి దారితీస్తాయా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశంగా మారింది.