Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బ, యూఎస్ అబ్బా... 20 ఏళ్లలో తొలిసారి షాక్!

ఈ క్రమంలో తాజాగా అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా 20 ఏళ్లలో తొలిసారిగా అమెరికా పాస్ పోర్ట్ మరింత బలహీనపడింది.

By:  Raja Ch   |   15 Oct 2025 12:14 PM IST
ట్రంప్ దెబ్బ, యూఎస్ అబ్బా... 20 ఏళ్లలో తొలిసారి షాక్!
X

మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే నినాదాలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు.. ప్రపంచ దేశాల నుంచి అగ్రరాజ్యాన్ని ఆత్మీయంగా దూరం చేస్తున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా 20 ఏళ్లలో తొలిసారిగా అమెరికా పాస్ పోర్ట్ మరింత బలహీనపడింది.

అవును... హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్ - 2025 ప్రకారం.. 20 సంవత్సరాలలో తొలిసారిగా ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌ ల నుండి అమెరికా పాస్‌ పోర్ట్ పడిపోయింది. ఇందులో భాగంగా... ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న అమెరికా పాస్‌ పోర్ట్ ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. ఫలితంగా మలేషియా పాస్ పోర్ట్ తో సమానంగా మారింది.

తాజా నివేదిక ప్రకారం... అమెరికన్ పాస్‌ పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 180 గమ్యస్థానాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్‌ ను ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ దేశాలు ఆధిపత్యం కొనసాగిస్తున్నందున అంతర్జాతీయ వేదికపై అమెరికా (పాస్ పోర్ట్) పవర్ తగ్గుతున్నట్లు ఈ తగ్గుదల ప్రతిబింబిస్తుందని నిపుణులు అంటున్నారు.

శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌ కలిగిన దేశాలు!:

హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌ గా సింగపూర్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా... ఈ పాస్ పోర్ట్ తో 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. దాని తర్వాత స్థానాల్లో.. దక్షిణ కొరియా (190), జపాన్ (189 ) ఉన్నాయి. అనంతరం.. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

అమెరికా పాస్‌ పోర్ట్ ఎందుకు వీక్ అయ్యింది?:

అమెరికన్ పాస్‌ పోర్ట్ బలహీనపడటానికి విదేశీ విధాన అంశాలు, పరిమిత వీసా పరస్పర చర్య కారణమని అంటున్నారు. ఉదాహరణకు.. బ్రెజిలియన్లకు ఇలాంటి హక్కులను అందించడానికి అమెరికా నిరాకరించడంతో.. బ్రెజిల్ ఇటీవల యూఎస్ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని రద్దు చేసింది. అదేవిధంగా.. చైనా, వియత్నాం వారి కొత్త వీసా రహిత జాబితాల నుండి అమెరికాను మినహాయించాయి.

భారత పాస్‌ పోర్ట్ స్థానం ఇదే!:

హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్‌ - 2025 లో భారతదేశ పాస్‌ పోర్ట్ 85వ స్థానానికి పడిపోయింది. వాస్తవానికి గత సంవత్సరం 80వ ర్యాంక్ లో ఉండగా.. ఈ ఏడాది ఐదు స్థానాలు దిగజారిపోయింది. 2021లో భారత్ 90వ ర్యాంక్ తో అత్యల్ప స్థానాన్ని నమోదు చేయగా.. అత్యుత్తమ ర్యాంకింగ్ 2006లో 71వ స్థానంలో ఉంది.